సీఎం కేసీఆర్ నాయకత్వంలో..మహిళా సాధికారికతకు పెద్దపీట

Spread the love

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మాదారం మహిళలమయం
తరలివచ్చిన నారీలోకం
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆలోచింపచేసిన నాటికలు
ఉత్తమ మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజా ప్రతినిధులకు సన్మానం..
అంగరంగ వైభవంగా తెలంగాణ మహిళ దినోత్సవ వేడుకలు
కోలాటం, బతుకమ్మలతో ఘన స్వాగతం


సాక్షిత జిన్నారం :
మహిళలకు సాధికారికత కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 12వ రోజైన జిన్నారం మండలం మాదారం గ్రామంలోని ప్రవేటు ఫంక్షన్ హాల్లో పటాన్చెరు నియోజకవర్గస్థాయి తెలంగాణ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలి రావడంతో మాదారం గ్రామం మహిళల మయంగా మారింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులకు కోలాటం, బతుకమ్మలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారని తెలిపారు. ప్రధానంగా స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, పారిశ్రామిక రంగంలోనూ పూర్తిస్థాయిలో ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. దీని మూలంగా మహిళలు ఇప్పుడు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కళా సాంస్కృతిక , సేవా విభాగాలి, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక విషయాలలో పురుషులకు దీటుగా దూసుకెళ్తున్నారని తెలిపారు.


దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని తెలిపారు.
ప్రతి జిల్లాలో సఖి మరియు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి లైంగిక, గృహ హింసకు గురైన బాధితులకు అండగా నిలుస్తూ వారికి సత్వర న్యాయం అందిస్తోందని తెలిపారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టిన అనంతరం బాల్యవివాహాలు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టాయని అన్నారు. గర్భిణీ స్త్రీలతో పాటు పుట్టిన పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి మహిళలకు వరంగా మారిందని అన్నారు.


ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళలకు 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు.
ప్రతినిత్యం ప్రతిక్షణం మహిళల సాధికారత కోసం తపన పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని మహిళలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పటాన్చెరు మండలం చిట్కుల్ గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య రూపకం అందరినీ అలరించింది. మెరుగైన ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులకు ఎమ్మెల్యే జిఎంఆర్ 10 వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, రవీందర్ గౌడ్, జెడ్పీటీసీలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు రోజా బాల్ రెడ్డి, లలిత సోమిరెడ్డి, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, మహిళా ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు, మహిళలు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page