SAKSHITHA NEWS

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

రంజాన్ పవిత్ర దినాలలో ముస్లిమ్ సోదరులకు జకాత్ ఇచ్చే సంప్రదాయం ఉంది. తమ ఆదాయంలో కనీసం 2.5 శాతం జకాత్ రూపంలో నిరుపేదలకు సాయం అందించాలని ప్రవక్త ఉద్భోధ. నమాజ్, జకాత్ ఇస్లామ్ మూల స్తంభాలు. జకాత్ను వ్యక్తిగతంగా చెల్లిం చడానికే పరిమితం కాకుండా, జకాత్ వ్యవస్థను స్థాపించాలన్నది ఖురాన్ పిలుపు. నమాజ్ను ఇంట్లోనే ఒంటరిగా చదువుకున్న దానికంటే మసీదుకు వెళ్లి సామూహికంగా ఆచరిస్తే ఎన్నోరెట్ల పుణ్యఫలం దక్కుతుంది. అలానే జకాత్ దానాన్ని వ్యక్తిగతంగా ఇవ్వడం కన్నా, సమష్టిగా వినియోగిస్తే అధిక పుణ్యం అని ఖురాన్ పేర్కొన్నది. జకాత్ డబ్బును ఏదో దానంగా ఇస్తున్నామని కాకుండా చిత్తశుద్ధిగా ఇవ్వాలి. కుడిచేత్తో ఇస్తే ఎడమచేతికి తెలియనంత గుప్తంగా ఇవ్వాలన్నది ప్రవక్త బోధనల సారాంశం. జకాత్ తీసుకునేవారికి ఆత్మాభిమానం దెబ్బతిన కుండా సొమ్ము ఇచ్చే ఏర్పాటు చేయాలి. సమ ష్టిగా జకాత్ ఇవ్వడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం కాదు. జకాత్ సొమ్ము వల్ల ఇచ్చేవారి సంపదలు కరిగిపోవు. శుద్ధి అవుతుంది. సమాజంలో పేదరిక నిర్మూలనకు ఇది చక్కని మార్గం. ‘తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ సంతోషం పొందే ఉద్దేశంతో వ్యయపరచేవారి వ్యయాన్ని మెట్టప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ భారీవర్షం కురవక, సన్నని జల్లు పడినా అదే దానికి చాలు. మీరు చేసేదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది’ అని ఖురాన్ వచనం. పవిత్ర మనసుతో ఇచ్చిన జకాత్ పరిపూర్ణమైనదని సెలవిచ్చారు ప్రవక్త.


SAKSHITHA NEWS