విజయవాడ: నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి (ఇంద్రకీలాద్రి) 8వ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది..
ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ రామారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ… ఆలయంలో ఎలీవేటెడ్ క్యూలైన్లు ఏర్పాటును ఆమోదించామని తెలిపారు. పూజా మండపాలు కొండ పైన ఏర్పాటు చేస్తామన్నారు. శివాలయం అంతరాలయంలో ఏసీ, మండపం చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు..
జనవరి 26వ తేదీన లక్షకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పారు. వీఐపీలు, వికలాంగులు, వృద్ధుల నివేదన సమయంలో 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకూ సాధారణ భక్తులకు దర్శనం నిలిపివేస్తామని తెలిపారు. త్వరలో గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం బస్సు తిప్పాలని నిర్ణయించామన్నారు. ఇందుకు బస్సుకు పర్మిట్ తెచ్చుకోవాల్సి ఉందన్నారు. ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పనులకు ఒక రూపం తెస్తామన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండులలోని కౌంటర్లలో అమ్మవారి ప్రసాదం అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొండ చరియల పనులపై మంత్రితో కూడా చర్చించి త్వరలోనే ఆ పనులను పూర్తి చేస్తామని కర్నాటి రాంబాబు తెలిపారు..