SAKSHITHA NEWS

బిఆర్ఎస్ అసమర్థత పాలన తో అభివృద్ధికి నోచుకోని మారుమూల గ్రామాలు
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :
బిఆర్ఎస్ అసమర్థత పాలనతో హుస్నాబాద్ నియోజక వర్గంలోని మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడపగడప కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గురువారం అక్కన్నపేట మండలం మల్చేరువు తండా పరిధిలోని పలు తండాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఏ తండా చూసిన అభివృద్ధికి నోచుకోలేదని కనీసం ఆ తండాలను పట్టించుకునే నాధుడే లేడు అని అన్నారు. తండాల్లో కనీస నీటి వసతులు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం సరిగా లేదని పేర్కొన్నారు.

వేల కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి ప్రభుత్వం మంచి నీటిని అందివ్వ లేక పోయిందని అన్నారు. తమ తండాకు సరైన రోడ్డు, మంచినీటి సౌకర్యం, మురుగు నీటి కాలువలు లేవని ప్రవీణ్ రెడ్డి కి తండా వాసులు సమస్యలు తెలుపగా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తమ తండాలో విద్యుత్ తీగల వల్ల ప్రమాదం పొంచి ఉందని మొరపెట్టుకున్న నర్సింగ్ తండా వాసులకు ఆ సమస్య లేకుండా పరిష్కరిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో నే తండాలు అభివృద్ధి చెందాయి అని, తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తో నియోజక వర్గం లో తండాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే వృద్ధులు, వికలాంగులు వితంతువులకు బీడీ కార్మికులకు కల్లుగీత కార్మికులకు చేనేత కార్మికులకు రూ. 4000/- పింఛన్ ఇస్తామని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న తరహా లో మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు.

ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం అని, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల సాయం చేస్తామని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, అధికారం లోకి వచ్చిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేల సాయం, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు రూ. 12 వేల సాయం అందిస్తామని ప్రవీణ్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియా గాంధీ ఋణం తీర్చు కోవాలని కోరారు.


SAKSHITHA NEWS