SAKSHITHA NEWS

ప్రార్థన మందిరం ముందు రోడ్డు విషయంలో తలెత్తిన గొడవ.

ఫిబ్రవరి 14 తెలంగాణ శంకర్ పల్లి : (సాక్షిత న్యూస్) జన్వాడలో రోడ్డు వేస్తుండగా తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకొగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. జన్వాడ గ్రామంలో హెచ్ఎండిఏ నిధులతో మంగళవారం సాయంత్రం పూట రోడ్డు వేస్తుండగా వివాదం తలెత్తింది. ఒక వర్గానికి చెందిన ప్రార్థన మందిరం ముందు నుండి సిసి రోడ్డు పనులు జరుగుచుండగా కొద్దిగా స్థలం వదిలిపెట్టి రోడ్డు వెయ్యాలని వారు కోరగా, మరో వర్గం వారు స్థలం వదిలిపెట్టకుండా రోడ్డు వేస్తామని తెలపడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. చర్చి వద్ద పెద్ద రణరంగమే జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాళ్లు విసురుకోవడం, మూక దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. హనుమంతు గాళ్ళ రాజకుమార్, తొంట బిక్షపతి, న్యాలట కృష్ణ, కొల్లూరు బాలయ్య, అంతి గళ్ళ స్వామి, మద్దూరి ప్రభుదాస్, కొల్లూరి లావణ్య, అప్పగల్ల ప్రమీల, తొంట శ్రీజ లకు గాయాలయ్యాయి. మరో వర్గం వారికి సైతం గాయాలైనట్లు గా సమాచారం. అయితే గొడవ సమాచారం అందుకున్న మోకిల పోలీసులు గ్రామానికి వెళ్లగా , గొడవ సద్దుమనగకపోవడంతో అదనపు బలగాలను రప్పించారు. రాజేంద్రనగర్ ఇన్చార్జి డిసిపి సాధన రష్మీ పెరుమాళ్, నార్సింగి ఏసిపి లక్ష్మీనారాయణ, మోకిల, శంకర్ పల్లి, నార్సింగి సిఐ లు వీరబాబు, వినాయక్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి లు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గొడవకు గల కారణాలను తెలుసుకొని ఇరు వర్గాలను సముదాయించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఆవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. బుధవారం రోజు సైతం రాజేంద్రనగర్ ఇన్చార్జి డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టారు. గ్రామంలోకి కొత్తవారిని ఎవరిని అనుమతించలేదు. ఇరు వర్గాలను సముదాయించి శాంతి కమిటీ ఆధ్వర్యంలో సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. చర్చి వద్ద రోడ్డు విషయంలో తలెత్తిన గొడవ గురించి తెలుసుకున్న పలువురు జన్వాడ గ్రామాన్ని సందర్శించారు. జరిగిన విషయాన్ని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ భీమ్ భరత్ గ్రామాన్ని సందర్శించి జరిగిన విషయాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇరు వర్గాల వారు శాంతియుత వాతావరణం లో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామంలో నిత్యం అన్నదమ్ముల కలిసిమెలిసి తిరిగేవారు మనస్పర్ధలకు అవకాశం లేకుండా మసులుకోవాలని అన్నారు.బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన చేస్తున్న వారికి మద్దతు పలికారు.న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఒక వర్గం నేతలు శంకర్ పల్లి-మెహిదీపట్నం రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

WhatsApp Image 2024 02 14 at 6.57.04 PM

SAKSHITHA NEWS