SAKSHITHA NEWS

మోడీ హయాంలో అగమ్యగోచరంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు:

కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:

జీ. దామోదర్ రెడ్డి, సీపీఐ
మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి

కొద్దిమంది చేతుల్లోనే దేశ సంపద ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నాచారం, హెచ్ ఎమ్ టీ నగర్, బాపూజీ నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లో కరపత్రాలను ఓటర్లకు పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ భారత్ స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా ప్రజల జీవితాల్లో మాత్రం ఆశించిన మార్పు రాలేదన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయని విమర్శించారు. దేశ ఆర్థికాభివృద్ధి మేడిపండు చందంగా తయారైందని అన్నారు. సంపన్నులు మరింత సంపన్నులుగా అందనంత స్థాయికి ఎదుగుతున్నారనీ, పేదలు మాత్రం మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బ్రిటీషు కాలం నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత భారతంలోనే అసమానతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయంటూ పలు గణాంకాలు, నివేదికలను వారు చెప్పారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్నదని మోడీ ప్రభుత్వం చెప్తున్నదని, తమ పాలనలో భారత్ సాధించిన ఘనతగా దీనిని బీజేపీ ప్రచారం చేసుకుంటున్నదని, అయితే దేశంలో సంపద మాత్రం కొద్ది మంది చేతుల్లోనే పోగై ఉన్నదన్నారు. అంబానీలు, అదానీలు ఒకరితో ఒకరు పోటీపడి ప్రపంచ సంపన్నులుగా ఎదుగుతున్నారే కానీ, పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం, కనీసం ఆదాయం లేక విలవిలలాడుతున్నారు. మోడీ పాలనలో పెరుగుతున్న ఆహార ” ద్రవ్యోల్బణం, ధరలు, నిరుద్యోగం వంటి అంశాలు సామాన్య ప్రజలకు శాపంగా మారాయన్నారు. ఇవన్నీ చూస్తే.. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీషు కాలంలో ప్రజలు అనుభవించిన అసమానతల కంటే మోడీ పాలనలోనే అసమానతలు అధికంగా ఉన్నాయని వారు ఆరోపించారు. అవినీతిని రూపుమాపుతాననీ, నల్లధనాన్ని తీసుకొస్తాననీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీలు గుప్పించి 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ.. బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్లకు దాసోహంగా మారారన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు తేవటం, సవరణలు చేయటం, పాలసీలు ప్రవేశపెట్టటం వంటి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనైనా ప్రజలు ఆలోచించి ఓటు వేసి.. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి.సత్య ప్రసాద్….సీపీఐ నియోజకవర్గ నేతలు కృపాకర్,శోభ, రాజేశ్వరి, కిష్టమ్మ, శివాని, లలిత, నీలంబరి,యాకమ్మ, రాంబాబు,నాగలక్ష్మి,విజయ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 05 09 at 6.09.16 PM

SAKSHITHA NEWS