హైదరాబాద్: ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ కొనసాగుతున్నది. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
దీంతో ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద తమ వంతుకోసం అరకిలోమీటర్ మేర దరఖాస్తుదారులు లైన్లలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని యువత, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లారీల యజమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పింఛన్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం అనేక మంది వికలాంగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లులు వచ్చారు. దరఖాస్తుదారులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట్లో ప్రతి రోజూ నిర్వహించిన ప్రభుత్వం.. తర్వాత దానిని మంగళ, శుక్రవారాలకు పరిమితం చేసింది. రెండు రోజుల్లో ఉదయం 10 గంటల వరకు ప్రజాభవన్‌కు వచ్చినవారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. వారిని అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.