SAKSHITHA NEWS

పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలోని 25వ డివిజన్ మేదర బజార్ లోని బస్తి దవాఖానలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం క్రింద నాటికి 3 లక్షల 58 వేల 48 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన అన్నారు. ఇందులో లక్షా 71 వేల 299 మంది పురుషులు, లక్షా 86 వేల 598 మంది స్త్రీలు, 103 ట్రాన్సజెండర్ లు ఉన్నారన్నారు. 283 గ్రామ పంచాయతీలు, 66 వార్డుల్లో కార్యక్రమం పూర్తి చేసినట్లు, 43 గ్రామ పంచాయతీలు, 12 వార్డుల్లో పురోగతిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష అనంతరం 79 వేల 923 మందికి రీడింగ్ కళ్ళద్దాలు ఆందజేసినట్లు, 49 వేల 763 మందికి ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు అవసరం గుర్తించి, ఆర్డర్ అనంతరం 30 వేల 409 మందికి ఆందజేసినట్లు, 2 లక్షల 28 వేల 360 మందికి కంటి సమస్యలు లేనట్లు మంత్రి తెలిపారు.

ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి మంచి స్పందన ఉందన్నారు. గ్రామాల్లో ముందస్తుగా శిబిరం ఏర్పాటు గురించి టాం టాం ద్వారా విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు, శిబిరానికి హాజరు కావాల్సినదిగా ఆహ్వాన పత్రికలు ఆందజేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి, కార్యక్రమం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం పూర్తి ఉచితంగా కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకట్, మడురి ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS