పలు కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి -ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు ఊకె రవి
పలు కులాలను షెడ్యూల్ తెగ జాబితాలో కలపడానికి చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని, గిరిజన గ్రామాలలో ఏజెన్సీని వర్తింపచేయాలని, అశ్వరావుపేటను మున్సిపాలిటీ చేసే ఆలోచన మానుకోవాలని న్యాయవాది ఆదివాసి రాష్ట్ర నాయకులు ఊకె రవి అన్నారు. అశ్వరావుపేట మండలం, కేశప్ప గూడెం గ్రామంలో మంగళవారం ఆదివాసి చట్టాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా న్యాయవాది ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు ఊకె రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పలుకులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అశ్వరావుపేట ను మున్సిపాలిటీగా చేయాలని ఇటీవలే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు చేసిన ప్రతిపాదన దరఖాస్తును ఉపసంహరించుకోని ఆదివాసులు నివసించే గ్రామాల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలను సేకరించాలని అన్నారు.
ఏజెన్సీ గ్రామాల్లో ఏజెన్సీ చట్టాలను అమలు చేయకుండా అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు. పలు ఏజెన్సీ గ్రామాలలో ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నారని, అధికారులు గిరిజనేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ ట్రైకార్ లోన్స్ దారి మరిలించి ఆదివాసీలకు అన్యాయం చేస్తుందన్నారు. ఆదివాసీలకు జరిగే అన్యాయాలు, అక్రమాలు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన అశ్వరావుపేట మండల కన్వీనర్ కణితి వెంకటేష్, కాసేప్పగూడెం గ్రామస్తులు కుర్సం బాబురావు, సొందె సుమన్, పూనెం రమేష్, కె కృష్ణ, సహదేవుడు, కొర్సా వెంకటేష్, సోడెం సీతయ్య, దాట్ల చుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.