మద్యతరగతి కుటుంబాల ఇంటి బడ్జెట్ తలకిం దులైంది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నిత్యావసరాల కోసం నెలవారీ బడ్జెట్ రూ.15వేల నుంచి రూ.18వేలకు చేరింది
గతేడాదితో పోలిస్తేతే ధరలు పెరగటమే తాజా పరిస్థితికి కారణం. అయితే ఆ స్థాయిలో ఆదాయాలు లేకపోవడంతో ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మార్కెట్లలో పెరుగుతున్న నిత్యావసర సరుకులు, పెట్రో, గ్యాస్ ధరలు సామాన్యుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు నెలల కాలంలో పలు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెలు, విద్యుత్ ఛార్జీలు సామాన్యులపై దండెత్తుతున్నాయి. పెరుగుతున్న ధరల దాడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా నూనెల ధరలు ఆకాశనంటుతున్నాయి. కిలో సన్‌ఫ్లవర్ నూనె రూ.145 నుంచి రూ. 150 ఉన్న ధర ప్రస్తుతం రూ. 195 నుంచి రూ. 200 వరకు చేరింది. పామాయిల్ ధర రూ. 120 ఉండగా ప్రస్తుతం రూ.160 వరకు పలుకుతోంది. వేరుశనగ నూనె ధర రూ.180 నుంచి రూ. 230 వరకు చేరింది. ఇలా పలు నూనెల ధరలు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా భావించిన పలువురు వ్యాపారులు నో స్టాక్ పేరిట అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. లీటరు పెట్రోలు రూ.115.30 పైసలుండగా, డీజిల్ రూ.101 కి చేరింది. కేంద్ర, రాష్ట్ర పన్నుల మోతతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధనం ధరల పెంపు అన్ని రంగాలపై పడుతోంది. రవాణా ఛార్జీలు పెరగడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై భారాలు తప్పడం లేదు.
అదేబాటలో నిత్యావసరాలు
కూరగాయలు, నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. గత నెలలో పచ్చిమిర్చి కిలో రూ.30 ఉండగా, ప్రస్తుతం రూ.45కు చేరింది. కిలో కంది పప్పు రూ.110 నుంచి రూ.130 వరకు, మినుములు రూ.100 నుంచి రూ.140, పెసరపప్పు రూ.100 నుంచి రూ.120, చక్కెర రూ.35 నుంచి రూ.45 వరకు, గోదుమలు రూ. 50 నుంచి రూ. 65 వరకు పెరిగాయి. మరో వైపు గ్యాస్ ధరలు నెలవారీగా పెంచుతుండడంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది 14 కిలోల సిలిండర్ ధర రూ.930 నుంచి దశల వారీగా పెరుగుతూ తాజాగా రూ.1210కి చేరింది. గ్యాస్ ధర పెంపుతో నెలకు జిల్లా ప్రజలపై రూ.అరకోటి మేరకు అదనపు భారం పడుతోంది. తాజాగా విద్యుత్ ఛార్జీలు సైతం సర్‌ఛార్జీల పేరుతో మోత మోగుతున్నాయి. యూనిట్ ధర పెరగడంతో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ బిల్లులు భారం అదనంగా మారింది. గృహావసరాల విద్యుత్ ఛార్జీ రూ.0.40 పైసలు నుంచి రూ. 0.50 పైసల వరకు పెరిగింది.
పెరిగిన ఇంటి బడ్జెట్
భాస్కర్, హిందూపురం
మా ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటున్నాం. పెరిగిన ధరలతో నిత్యావసర సరుకుల కొనుగోలుకు కనీసంగా రూ.8వేలు వెచ్చించక తప్పడం లేదు. టూ వీలర్, పెట్రోల్ బిల్లు నెలకు రూ.3వేల చేరింది. విద్యుత్, పాల బిల్లు కలిపి మరో రూ.3వేలు అవుతోంది. ఇంటి పన్నులు పెరగటంతో ఇంటి అద్దె పెంచేశారు. గతంలో రూ.4,500 ఇప్పుడు రూ.5వేలు చెలించాల్సి వస్తుంది. తీసుకునే వేతనం చాలక అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్య అవసరాలకు చేతిలో చిల్లిగవ్వ ఉండట్లేదు.
ధరలను నియంత్రించాలి
మల్లికా బాను, గృహిణి సిపిఐ కాలనీ, హిందూపురం.
పాలక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే ప్రచారం విస్తతంగా చేస్తున్నాయి. మరో వైపు పన్నులు రూపంలో వసూలు చేస్తున్నాయి. ప్రతి కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరూ కష్టపడినా కుటుంబ ఖర్చుల కోసం ఇబ్బందులు తప్పటం లేదు. పాలక ప్రభుత్వాలు చొరవ చూపాలి. ధరల నియంత్రణపై దష్టి పెట్టాలి.