SAKSHITHA NEWS

బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు.

అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమివేశాడు. కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు.

ఆనక తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని, దీంతో వారిని చంపేసినట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది. సర్పవరం సీఐ పెద్దిరాజు కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్‌ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఎకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.

నగరంలోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, ఒకటో తరగతి చదివే జోషిల్‌ (7), యూకేజీ చదివే నిఖిల్‌ (6) పిల్లలున్నారు. వారు సరిగా చదవడం లేదంటూ ఇటీవలే పాఠశాలను మార్పించారు.
భార్యను నమ్మించి.. పిల్లల్ని ముంచాడు.

హోలీ సందర్భంగా చంద్రకిశోర్‌ శుక్రవారం భార్య, పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. అక్కడే ఉండాలని పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్‌ వద్దకు తీసుకెళ్తున్నానని, పది నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడం, ఫోన్‌ చేసినా, ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరారు. కిటికీలోంచి చూడగా, భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్‌లలో తలలు మునిగిపోయి ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారామె. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్‌ సూసైడ్‌ నోటులో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి సోదరుడు వాపోయారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app