SAKSHITHA NEWS

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రైతు పక్షపాతి తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రైతు దినోత్సవం సందర్భంగా రఘునాథపాలెం రైతు వేదిక, ఈర్లపూడి క్లస్టర్ రాక్యా తాండాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతాంగానికి సమావేశాలకు, సాగు కొత్త మెళకువలు, పంట మార్పిడి తడితరాలపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు కార్యక్రమాల నిర్వహణకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడు తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికలు ఉండగా, జిల్లాలో 129 రైతు వేదికలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రైతుల మోముపై చిరునవ్వే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

రైతుబంధు క్రింద రాష్ట్రంలో 65 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతు భీమా పదిరోజుల్లో జమ అవుతున్నట్లు ఆయన తెలిపారు. 30 వేల కోట్ల ఖర్చుతో విద్యుత్ వ్యవస్థ ప్రక్షాళన చేసి, విద్యుత్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 19 లక్షల బోర్లు ఉండగా, ఇప్పుడు 30 లక్షలకు చేరాయన్నారు. మిషన్ కాకతీయ తో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. మొక్కజొన్నను కనీస మద్దతు ధరతో కొని, రైతులకు అండగా నిలబడినట్లు ఆయన తెలిపారు. మార్చిలో అకాల వర్షాలు, వడగండ్లకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి పది వేలు పంట నష్టం క్రింద మంజూరు చేయగా, రాష్ట్రం లో 228 కోట్లు, ఖమ్మం జిల్లాలో 23 కోట్లు విడుదల కాగా, రైతు దినోత్సవం శనివారం రోజునుండే పంపిణీ చేపట్టినట్లు ఆయన అన్నారు. వ్యవసాయం దండుగా నుండి వ్యవసాయం పండుగ అనేలా ప్రభుత్వం చర్యలు తీసుకొందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, 10 సంవత్సరాల్లో రాష్ట్రం కానీ వినీ ఎరగని ప్రగతి సాధించిందన్నారు.

వేసవి కాలం వస్తే, త్రాగునీరు, సాగునీరు, కరంట్ కోతలతో నానా ఇబ్బందులు పడేవారమని, ఏ రాష్ట్రంలో లేని మార్పు మన రాష్ట్రం కొద్ది కాలంలోనే సాధించిందని ఎంపీ అన్నారు. దేశంలో ఎక్కడా రైతు వేదికలు లేవని, ఏ పంట, ఏ కాలంలో వేయాలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతుబంధు, రైతుభీమా, పంట కొనుగోలు, ఉచిత విద్యుత్ ఎక్కడా లేవని ఎంపీ అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, రైతును రాజు చేసి, వ్యవసాయాన్ని పండుగలా రాష్ట్ర ప్రభుత్వం మార్చిందని అన్నారు. రాష్ట్రంలో 2601రైతు వేదికలు ఉండగా, జిల్లాలో 129 రైతు వేదికలు ఉన్నట్లు, ఇందులో సాగు, మార్కెటింగ్, మెళకువలపై చర్చ జరుగుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ముందస్తు సాగు చేయాలని, లేనిచో అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లుతుందని, రోహిణి కార్తె లోపల సాగు చేయాలని, మంచి దిగుబడి వస్తుందని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయానికి సంబంధించి రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా సహకార అధికారిణి విజయ కుమారి, రఘునాథపాలెం ఎంపిపి గౌరీ, జెడ్పిటిసి ప్రియాంక, క్లస్టర్ పరిధిలోని గ్రామాల సర్పంచులు, పిఏసీఎస్ డైరెక్టర్లు, ఆత్మ, రైతుబంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS