Talasani Shankar Yadav always stood by the workers and solved their problems and was a worker partisan.
తలసాని శంకర్ యాదవ్ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల పక్షపాతిగా నిలిచారని BC సంక్షేమ శాఖ మరియు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ సోమవారం మరణించగా మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లు వెస్ట్ మారేడ్ పల్లిలోని రాధికా కాలనీలో గల శంకర్ యాదవ్ నివాసానికి చేరుకొని శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. శంకర్ యాదవ్ గతంలో బోయిన్ పల్లి మార్కెట్ ట్రేడర్స్ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో కూడా కార్మికులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారికి అన్నివిధాలుగా అండగా నిలిచే వారని గుర్తు చేశారు. అందరూ శంకర్ అన్న అని ఎంతో ప్రేమగా పిలుచుకునే శంకర్ యాదవ్ మృతి చాలా బాధాకరం అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రారధిస్తున్నట్లు తెలిపారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర నాయకులు నవీన్ యాదవ్, BRS పార్టీ రాష్ట్ర యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు ఉన్నారు.