సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ స్థానిక ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించి, పిల్లలతో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో మమేకమై పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 460 మంది పిల్లలున్నట్లు, ఉన్న టాయిలెట్ బ్లాకును బాలికల కొరకు వినియోగిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు శైలజ తెలిపారు.
స్పందించిన కలెక్టర్ టాయిలెట్ బ్లాకు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలు, యూనిఫాం అందినది లేనిది, ఆంగ్ల బోధన విషయమై అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, లక్ష్యం దిశగా పట్టుదలతో శ్రమించాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఉద్భోదించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మాలతి, సిఎంఓ రాజశేఖర్, ఎస్ఎంసి చైర్మన్ నారాయణ రావు, అధికారులు, తదితరులు ఉన్నారు.