సామాజిక రుగ్మతలను ఎదిరించిన మొదటి మహిళ సావిత్రిబాయి పూలే
-డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
సమాజంలోని దురాచారాలను, అస్పృశ్యతను, మహిళలపై నిర్బంధ కట్టుబాట్లను ఎదిరించి దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు గా స్త్రీలను చైతన్యపరిచిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ తెలిపారు. పండితాపురం గ్రామంలో సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మళ్లీ బాబు యాదవ్ తో పాటు బిసి సంఘాల నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గొప్ప సామాజిక మార్గదర్శకురాలని, ఆనాడు వివక్ష గురవుతున్న స్త్రీలను చూసి చదువు లేకపోవడం వల్ల, స్త్రీలు విజ్ఞానవంతులు కాకపోవడం వలన అన్యాయాలకు గురవుతున్నారని భావించి, తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో ఆనాటి సనాతన వాదులను ఎదిరించి రాత్రిపూట పాఠశాల స్థాపించి దొంగతనంగా స్త్రీలకు విద్యాబోధన చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని, అంటువ్యాధి వచ్చిన సమయంలో ఎంతోమంది పేదవారిని ఆదరించారని, అదే అంటువ్యాధితో 66 సంవత్సరాల వయసులో కన్నుమూశారని, అయినా ఇప్పటికీ ఆమె చూపిన మార్గదర్శకత్వంతోనే స్త్రీలు చైతన్యవంతమయ్యారని పేర్కొన్నారు. ఆమె యొక్క ఆశయాలను స్త్రీలు సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు నాయక్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్ మాదిగ, బిసి సంఘం నాయకులు రాయల బిక్షమయ్య గుగులోత్ రాంజీ మరియు ఐ ఎస్ సి ఎస్ టి బీసీ ల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.