SAKSHITHA NEWS

హైదరాబాద్:
ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు రవీందర్ భార్య సంధ్యకు ఉద్యోగం ఇచ్చేందుకు పోలీస్ శాఖ అంగీకరించింది.

దీంతో రవీందర్ అంత్యక్రియలకు భార్య సంధ్య ఒప్పుకున్నారు. పోస్టుమార్టం అనంతరం రవీందర్ మృతదేహాన్ని భార్య సంధ్య కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అంతకు‌ముందు తమకు న్యాయం చేయాలని రవీందర్ భార్య సంధ్య ఆందోళనకు దిగారు.

దీంతో పోలీస్ శాఖ ఆమెతో చర్చించారు. ఉద్యోగం ఇస్తామని మామీ ఇవ్వడంతో రవీందర్ భార్య సంధ్య ఆందోళన విరమించారు. తన పిల్లల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనేదానిపై పోలీసు శాఖ స్పష్టత ఇవ్వలేదు.. దీంతో ఆమె సీపీతో మాట్లాడాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం రవీందర్‌కు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. రవీంద్రర్ అంత్యక్రియలను శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని పోలీస్ శాఖను సంధ్య కోరారు.

కాగా ప్రాణపాయ స్థితిలో అపోలో డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డు రవీందర్ ఉదయం మృతి చెందారు.

పాతబస్తీ ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన రవీందర్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన రవీందర్ ఇటీవలే చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.

కాగా సమయానికి వేతనాలు రావడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన రవీందర్ ఈ నెల 5న హోంగార్డు హెడ్ ఆఫీస్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. దీంతో రవీందర్‌ను వెంటనే పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

55 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్ ఈ నెల 6న సాయంత్రం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కంచన్ బాగ్ అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు.

అప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలో ఐసీయులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రవీందర్ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో రవీందర్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


SAKSHITHA NEWS