SAKSHITHA NEWS

పరిశ్రమల సేఫ్టీ ఆడిటింగ్ కు అత్యంత ప్రాధాన్యత

  • కలెక్టర్ పి ప్రశాంతి
    ……

సాక్షిత రాజమహేంద్రవరం :
పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయి భధ్రత పర్యవేక్షణ కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించే క్రమంలో చెక్ లిస్టు రూపొందించుకుని క్షేత్ర స్థాయిలో కార్యాచరణకు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో పరిశ్రమల భద్రతపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాలు జరిగిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడం కంటే ముందస్తుగానే ప్రమాదాల స్థాయిని గుర్తించి వాటి నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవడం పై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాస్థాయిలోని పరిశ్రమల భద్రత కమిటీ సభ్యులతో కూడిన బృందం వివిధ పరిశ్రమలను పరిశీలించి అక్కడ చేపడుతున్న రక్షణ తదితర అంశాలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. అగ్నిమాపక ప్రమాదాల నివారణకు సంబంధించి చేపడుతున్న చర్యలు విద్యుత్ సరఫరా పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు, గుర్తించిన లోటుపాట్లు. పై నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులు, రసాయనిక పదార్థాలు అందుకోసం వినియోగించే కెమికల్స్ ఇతర ప్రమాద కారక అంశాలను ముందుగా గుర్తించాలన్నారు. పరిశ్రమ స్థాపనలో భాగంగా చేపట్టవలసిన భద్రత చర్యలపై ప్రోటోకాల్ ప్రకారం రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలించి ఆ మేరకు ఆయా కంపెనీ యాజమాన్యాలు చేపడుతున్న చర్యలపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. కాలుష్య నివారణ సంబంధించి పర్యావరణ శాఖ, విద్యుత్ సరఫరా సంబంధించి విద్యుత్ శాఖ, అగ్రిమాపక ప్రమాదాల నివారణకు ఫైర్ విభాగం, కంపెనీ యాక్ట్ చట్టం ప్రకారం అమలు చేస్తున్న భద్రతాపరమైన చర్యలు, ప్రమాదాల సమయంలో వైద్య సహాయం దించేందుకు అందుబాటులో ఉన్న సేవలు, కార్మిక శాఖ ద్వారా పరిశ్రమలో పనిచేసే వారి సంక్షేమం కోసం చేపడుతున్న రక్షణ చర్యలు తదితర అంశాలను సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం సమన్వయ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని పరిశ్రమలను తనిఖీలు చేయాల్సిందన్నారు. తనిఖీల సందర్భంగా ఆయా పరిశ్రమల యాజమాన్యానికి మెరుగైన సూచనలు సలహాలు అందించి పరిశ్రమల పరిరక్షణ దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాలు, వెలువడే రసాయన పదార్థాలు, ప్రమాద స్థాయి వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందచేయాలని పేర్కొన్నారు.

కంపెనీల సామాజిక బాధ్యత పై కలెక్టరు సమీక్ష:

స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల ద్వారా సి ఎస్ ఆర్ ద్వారా వివిధ పనులను చేపట్టడం ద్వారా ఆ ప్రాంతంలోని వారికి ఉపయుక్తంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో కంపెనీ సామాజిక బాధ్యత కింద ప్రజల అవసరాలు, మెటల్ కూ పనులను చేపట్టేలాగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఆయా కంపెనీలు స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి పనులు చెప్పడం ద్వారా అక్కడి ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉందన్నారు. సి ఎస్ ఆర్ కింద పనులను చేపట్టడంలో నిధుల సమీకరణ కంటే ఆయా కంపెనీ యాజమాన్యాలే ప్రతిపాదన పనులను చేపట్టేలాగా చూడాలని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను గుర్తించి యాజమాన్యాలకు తెలియ జేయడం ద్వారా వాటినీ పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అని స్పష్టం చేశారు. సి ఎస్ ఆర్ పర్యవేక్షణా కమిటి కి నిబద్దత కలిగి
పరిశ్రమల ఉండే ప్రదేశాల్లో ఆయా ప్రతిపాదిత పనులను చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగానే వారు ప్రణాళిక రూపొందించడం, రూట్ మ్యాప్ ప్రకారం అడుగులు వేయాలని కోరారు. నగదు చెల్లింపు కాకుండా పనులు చేపట్టే దిశగా వారిని ప్రోత్సహం అందించాల్సి ఉంటుందన్నారు. ఆమేరకు చేపట్టే పనులను కలెక్టరు ఆమోదం తోనే చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ అధికారి జి రవిశంకర్, జిల్లా కార్మిక శాఖ అధికారి బిఎస్ఎన్ఎల్ వలి, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కే వెంకటేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం మార్టిన్ లూథర్ కింగ్, జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.హెచ్.ఎల్.సందీప్ రెడ్డి, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి టీవీ సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS