SAKSHITHA NEWS

Sabari Express had a big accident

శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. గుంటూరు సెక్షన్‌లో పట్టాలపై ఇనుప రాడ్డుకట్టిన దుండగులు

హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్

నల్లపాడు-గుంటూరు సెక్షన్‌లో పట్టాలపై ఇనుపరాడ్డును కట్టిన దుండగులు

లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ (17230)కు గుంటూరు వద్ద పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్‌లో ప్రయాణిస్తోంది.

ఈ క్రమంలో పట్టాలపై దుండగులు కట్టిన ఇనుపరాడ్డును గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది.

లోకోపైలట్ గుర్తించకుంటే కనుక పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు. రైలును ఆపిన అనంతరం రైల్వే సిబ్బంది రాడ్డును తొలగించారు. దీంతో రైలు తిరిగి బయలుదేరింది.


 
దుండగులు పొడవైన ఇనుపరాడ్డును పట్టాలపై అడ్డంగా పెట్టి, రైలు వస్తున్నప్పుడు దాని అదురుకు అది కిందికి పడిపోకుండా పట్టాలకు గుడ్డతో కట్టారు.

దుండగులు పథకం ప్రకారమే దానిని కట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రైలు పట్టాలపై గస్తీ నిర్వహించే సిబ్బంది తనఖీ చేసుకుంటూ వెళ్లిన అనంతరం వారు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఈ ఘటనపై రైల్వే పోలీసులు 154,174 సి సెక్షన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు….


SAKSHITHA NEWS