SAKSHITHA NEWS

రూ.2200 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడి

*
సాక్షిత, తిరుపతి బ్యూరో* : భారత మాల పరియోజన కార్యక్రమం ద్వారా తిరుపతి జిల్లాలో 2200 కోట్ల ప్రణాళికతో రెండు కొత్త రహదారులు మంజూరయ్యాయని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడించారు. ఈ మేరకు చిల్లకూరు క్రాస్ నుంచి చింతవరం మీదుగా తూర్పు కనుపూరు వరకు 36.05 కిలోమీటర్ల రోడ్డు రూ.909.47 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేయనున్నారని ఆయన చెప్పారు. ఈ రహదారికి సంబంధించి బిడ్డింగ్ ప్రాసెస్ పూర్తయిందని తెలిపారు. అలాగే నాయుడుపేట గ్రీన్ ఫీల్డ్స్ నుంచి తూర్పు కనుపూరు వరకు 34.88 కిలోమీటర్ల మేర రోడ్డు ను రూ.1398.84 కోట్లతో ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి సంబంధించి బిడ్డింగ్ ప్రాసెస్ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ఈ రహదారుల నిర్మాణంతో పారిశ్రామికంగా వెనుకబడిన ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి ఊపందుకొని, ఆ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని చెప్పారు. ఈ ప్రధాన రహదారుల అనుసంధానం చేస్తూ దగ్గరలోనే ఉన్న బీచ్ లకి రోడ్ల నిర్మాణం చేసినట్లయితే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని వివరించారు. తీర ప్రాంత ప్రజల జీవన స్థితి గతులు మెరుగుపడేందుకు ఈ రహదారుల నిర్మాణం దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఈ రహదారుల నుండి ఎన్నోర్ పోర్ట్ వరకు అనుసంధానం చేస్తూ మరో రహదారి నిర్మిస్తే రవాణాకు అనుకూలంగా ఉంటుందని, ఈ విషయం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అలాగే ఈ రహదారుల నిర్మాణం గూర్చి చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, రహదారులను మంజూరు చేసిన కేంద్ర రోడ్డు, రహదారులు మరియు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు.


SAKSHITHA NEWS