మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు…
ప్రజాపాలనను మరింత చేరువ చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి గాంధీభవన్ లో వారానికి ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా హాజరుకానున్నారు.
శుక్రవారాల్లో విజిట్ చేయనున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. రేపటి నుంచే ఈ కార్యక్రమం అమలు చేసేందుకు పార్టీ ప్లాన్ చేసింది. ఈ మేరకు విధి విధానాలు, మంత్రుల షెడ్యూల్ ను రూపొందించాలని గాంధీ భవన్ సిబ్బందికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలిచ్చారు. ఈ ప్రోగ్రామ్ వలన పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు అనుసంధానం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ ప్రతి రోజు ఐదారు గంటల సమయం పార్టీ కార్యకర్తల కోసం కేటాయిస్తామన్నారు.
వారంలో రెండు రోజులు ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు మంత్రులు అందుబాటులో ఉంటారన్నారు. పదేళ్ల తరువాత వచ్చిన ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు కాపాడుకుంటామన్నారు. కార్యకర్తల శ్రమతోనే ఇది సాధ్యమైందన్నారు. వాళ్ల సమస్యలను నేరుగా తీర్చడానికి ఇది అవకాశంగా ఉంటుందన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి, ప్రభుత్వానికి వారిధిగా ఉంటూ కార్యకర్తలను గెలిపించుకుంటామని పేర్కొన్నారు.