Request to ZP Chairman to resolve Chityaladable Bedroom Colony issues
వనపర్తి పట్టణంలోని చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో మిషన్ భగీరథ మంచినీటి సమస్య పరిష్కారానికి, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి జిల్లా పరిషత్ నుండి నిధులు మంజూరు చేయాలని డబుల్ బెడ్రూం కాలనీవాసులు జడ్పీ చైర్మన్ ఆర్.లోక్ నాథ్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయానికి కాలనీవాసులు వెళ్లి చైర్మన్ దృష్టికి డబుల్ బెడ్రూం కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు. కాలనీలో కొన్ని బ్లాకులకు మాత్రమే మిషన్ భగీరథ మంచినీటి సౌకర్యం ఉందని, మిగతా బ్లాక్ లకు మంచినీటి సౌకర్యం లేక ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని, సిసి రోడ్లు, వీధిలైట్ల సమస్య ఉందని చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ లేక బహిర్భూమికి పొలాల్లోకి వెళ్తున్నారని, రాత్రి సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చైర్మన్ దృష్టికి తెచ్చారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించిన మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ సమస్య ఉండడంతో లబ్ధిదారులు డబుల్ బెడ్రూం కాలనీకి రావడం లేదని, వనపర్తి పట్టణంలోనే అద్దెకు ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జెడ్పీ నిధులు కేటాయించి మిషన్ భగీరథ పనులు, సెప్టిక్ ట్యాంక్ పనులు ప్రారంభించి కాలనీ సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ చైర్మన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సుధాకర్ రెడ్డి, మండ్ల రాజు, సాయిలీల, మునీరుద్దీన్, శ్రీనివాసులు, వినోద్, గౌడ్, రాజేశ్వరి, జమీల్ తదితరులు పాల్గొన్నారు.