వేడుకగా రాట ముహూర్తం కార్యక్రమం
సెప్టెంబర్ 7 నుంచి నాళం భీమరాజు వీధి వినాయకుడి ఉత్సవాలు
రాజమహేంద్రవరం, సాక్షిత :
స్థానిక నాళం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ సిద్ధి లక్ష్మీ వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించిన రాట ముహూర్తం వేడుక ఆదివారం ఉదయం 8.30 గంటలకు జరిగింది. ఆలయ ఆర్చకులు మంత్రోచ్చరనల మధ్య ఆయల కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఎంఎన్ రావు తదితర పెద్దలు రాట ఉంచే గోతిలో పసుపు, కుంకుమ, క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి రాటను నిల్చోబెట్టారు. ఈ సందర్భంగా శెట్టి జగదీష్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ఇక్కడి వినాయకుడు ఏళ్ల తరబడి పూజలు అందుకుంటున్నాడని వివరించారు. 2019 వరకూ అప్పటి ప్రభుత్వం ఆలయం యొక్క బాగోలు చూసుకునేదని, తదనంతరం 2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు ఆలయం అభివృద్ధి కానీ, ఆలయ ఉత్సవాలు కానీ గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన నేపధ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పర్యవేక్షణలో ఆలయానికి కావాల్సిన అన్ని సదుపాయలు సమకూరుతున్నాయని, ఆయన ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల నేపధ్యంలో ఆలయానికి రంగులు వేయడం భక్తులకు కావాల్సిన ఇతర సౌకర్యాలు సమకూర్చడం జరిగిందన్నారు. అయినవిల్లి ఆలయం తరువాత ఈ ఆలయంలో మూషికం, నంది ఉంటాయని, అలాగే ధ్వజ స్తభం కూడా అయినవిల్లి ఆలయం ఇక్కడ తప్పితే మరే వినాయకుడి ఆలయం వద్ద ఉండవన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామి కాబట్టే నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈ ఆలయానికి వచ్చి చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేక పూజలు చేశారని శెట్టి జగదీష్ గుర్తు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు భక్తులు హాజరుకావాలని కోరారు. మాటూరి రంగారావు మాట్లాడుతూ ఈ ఆలయానికి 173 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. గోదావరి ఆనకట్ట కట్టిన సమయంలో సర్ ఆర్ధర్ కాటన్ ఈ ఆలయానికి వచ్చి పూజలు చేశారని గుర్తు చేశారు.
ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, అధిక సంఖ్యలో భక్తులు రావడం పరిపాటన్నారు. సర్ ఆర్ధన్ కాటన్ ఈ ఆలయానికి ఒక గంటను కూడా బహూకరించారని గుర్తు చేశారు. ఈ ఆలయం వద్ద 6 లేదా 11 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు కుంటే స్వామి వారి కోర్కెలు తీరుస్తాడని అనేందుకు అనేక ఘటనలు ఉన్నాయన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ఐఎఎస్, ఐపీఎస్ తదితర ప్రముఖలు స్వామి దర్శనానికి వస్తుంటారని అన్నారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తమ బృందం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగ్‌మళ్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొపర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈఓ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.