తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ హబ్ గా రామగుండం

Spread the love

జ్యోతినగర్‌,: పరిశ్రమలకు నెలవైన రామగుండం పవర్‌ హబ్‌గా మారుతున్నది. ఈ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్‌ కేంద్రాలతోపాటు ప్రైవేటు రంగంలో పవర్‌ ప్రాజెక్టులున్నాయి. 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంతోపాటు టీఎస్‌ జెన్‌కో, ఎన్టీపీసీ ఫ్లోటింగ్‌ సోలార్‌, సోలార్‌, ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, కేశోరాం సిమెంట్స్‌ క్యాప్టివ్‌ పవర్‌ స్టేషన్లున్నాయి. ప్రస్తుతం రామగుండం ఇండస్ట్రియల్‌ ఏరియాలో థర్మల్‌, సోలార్‌ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం 4,388 మెగావాట్లుగా ఉన్నది. అయితే టీఎస్‌టీపీపీలోని 800 మెగావాట్ల రెండో యూనిట్‌ జూన్‌లో ఉత్పత్తి దశలోకి రానున్నది. ఇప్పటికే దక్షిణాదిలోనే అతి పెద్ద విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందిన రామగుండం ప్రతిపాదిత మిగతా ప్రాజెక్టులు పూర్తయితే దేశంలోనే అతి పెద్ద విద్యుత్‌ క్షేత్రం(పవర్‌ హబ్‌) ఖ్యాతి గడించనుంది.

1960 దశకంలో ప్రాజెక్టుల అంకురార్పణ

ఇక్కడ ఉన్న అపారమైన సింగరేణి బొగ్గు నిక్షేపాల ఆధారంగా ఈ ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పారు. స్వాతంత్రం వచ్చిన తరువాత 1960వ దశకంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండం ఎ పవర్‌హౌజ్‌ను నెలకొల్పింది. తరువాత కాలంలో అప్పటి ఏపీఎస్‌ఈబీ ఆధ్వర్యంలో 62.5 మెగావాట్ల రామగుండం బి థర్మల్‌ కేంద్రాన్ని నిర్మించారు. అయితే రెండున్నర దశాబ్ధాల క్రితం రామగుండం ఎ పవర్‌హౌజ్‌ను మూసివేశారు. అలాగే 1978లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండం సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేసి, 1983లో ప్రారంభించారు. ఈ ఎన్టీపీసీ ప్రాజెక్టులో దశలవారీగా ఏడు యూనిట్లను(2,600మెగావాట్లు) నెలకొల్పారు. తరువాత కాలంలో సింగరేణి ఆధ్వర్యంలో నెలకొల్పిన 18 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం ఐదేళ్ల క్రితం మూతపడింది. సాంప్రదాయేతర రంగంలో విద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పానే ఉద్దేశంతో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 2009లో 10 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును నిర్మించారు.

టీఎస్‌టీపీపీకి శ్రీకారం..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి పునాదిరాయి పడింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో నాలుగువేల మెగావాట్ల ప్రాజెక్టును కేంద్రం నెలకొల్పుతోంది. ఈ ప్రాజెక్టును సైతం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలోనే స్థాపించాలని నిర్ణయించారు. 2016లో తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు పేరుతో మొదటి దశలో 1,600 మెగావాట్ల(800 మెగావాట్ల రెండు యూనిట్లు)కు ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కరోనా, సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 22న 800 మెగావాట్ల ఒకటో యూనిట్‌ ప్రారంభమైంది. జూన్‌లో రెండో యూనిట్‌ను ప్రారంభించనున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page