The process of handover of rice millers to FCI, CMR grain is expedited
రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి ,సిఎంఆర్ ధాన్యాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
……………………………………………………………………………………………………….
*సాక్షిత వనపర్తి:
రైస్ మిల్లర్లు ఎఫ్.సీ.ఐ కి ఇవ్వాల్సిన సీ.ఎం.ఆర్ ధాన్యాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
వనపర్తి శివారులోని రాఘవేంద్ర ఇండస్ట్రీస్, చిట్యాల గోడౌన్, పెద్దమందడి మండలం వీరాయ పల్లిలో ఉన్న మల్లిఖార్జున ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. మిల్లులలో రికార్డులను తనిఖీ చేశారు. రోజుకు మిల్లింగ్ సామర్థ్యం ఎంత? ఎంతమేర ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.అనంతరం చిట్యాల గోడౌన్ లో ఎస్.పీ.ఆర్ స్టాక్స్ తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలను పరిశీలించారు.
రాఘవేంద్ర ఇండస్ట్రీస్ రైస్ మిల్ ఖరీఫ్ 2023-24 సీజన్ కి గాను గత మార్చి నుంచి నేటికీ 12 ఏసీకేలు మాత్రమే డెలివరీ చేసిందని, మిగతా 43 ఏసీకేల ధాన్యాన్ని త్వరగా అప్పగించాలని ఆదేశించారు. అదేవిధంగా మిల్లింగ్ విషయంలో మిల్లర్లకు ఉన్న ఇబ్బందులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మల్లిఖార్జున ఇండస్ట్రీస్ 2022-23 ఖరీఫ్ సీజన్ లో కేవలం 11ఏసీకే ల ధాన్యం మాత్రమే అప్పగించారని, మిగతా ధాన్యం త్వరగా అప్పగించాలని అన్నారు. లేని పక్షంలో రెవెన్యూ రికవరి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
పౌర సరఫరాల కార్పొరేషన్ మేనేజర్ షేక్ ఇర్ఫాన్, డిటీ నంద కిషోర్, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.