ఖని హిందూ స్మశాన వాటికలో సమస్యలే సమస్యలు..
అంతిమ సంస్కారాలకు ప్రజల అవస్థలు,
మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం…..
సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహణ చేపట్టి ఉచిత సేవలు అందించాలని స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక డిమాండ్…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, గోదావరి నది తీరంలోని ఖని హిందూ స్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూలు చల్లి వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు మద్దెల దినేష్, అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్, ప్రధాన కార్యదర్శి దుర్గం నగేష్, ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ, స్మశాన వాటికలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పాలకులు, అధికారులు ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
మూడేళ్ల క్రితం వరకు అమలులో ఉన్న తక్కువ ఖర్చుతో అంత్యక్రియల సేవలను నిలిపివేయడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. స్మశాన వాటికలో తాగునీరు, విద్యుత్, సరైన రహదారి, ప్రహరీ గోడ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ముఖ్యంగా రాత్రి వేళల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు పదేళ్ల క్రితం రూ.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన గ్యాస్ దహన యంత్రం వినియోగంలోకి రాకపోవడంతో పాటు, దాని కోసం రూ.60 లక్షలతో నిర్మించిన షెడ్ కూడా నిరుపయోగంగా మారిందని విమర్శించారు.
హిందూ స్మశాన వాటిక ఎదురుగా ఉన్న సుమారు 10 ఎకరాల సింగరేణి ఖాళీ స్థలాన్ని స్మశాన వాటిక విస్తరణ, అభివృద్ధి కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికే పరిమితం కాకుండా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో స్మశాన వాటిక అభివృద్ధి జరగడం లేదని, నిర్వహణ బాధ్యతలను సింగరేణి యాజమాన్యానికి అప్పగించి ప్రజలకు ఉచిత సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల శ్రీనివాస్, కంది సుజాత, సరిత లక్ష్మి, రామ, సుశీల, కొండూరి రమాదేవి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
