రామన్నగూడెంలో ఐకమత్యం – ప్రకృతి సంపద సంరక్షణకు ఆదర్శంగా గ్రామం
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతి
నిధి: ఆత్మకూరు (ఎస్) మండలంలోని రామన్నగూడెం గ్రామ ప్రజలు ఐకమత్యంతో ముందుకు సాగుతూ, భగవంతుడు ప్రసాదించిన సహజ వనరులను సంరక్షించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం ద్వారా భూగర్భ జలాలు నిల్వ ఉండేలా కృషి చేస్తున్నారు. దీంతో గ్రామంలో తాగునీరు, సాగునీటి కొరత సమస్యలు తలెత్తకుండా ప్రజలు సమష్టిగా చర్యలు చేపడుతున్నారు. గ్రామ ప్రజల ఈ చైతన్యం ఇతర ప్రాంతాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఏటి వెంట ఉన్న గ్రామాలు కూడా ఇదే విధంగా ఇసుక అక్రమ తరలింపును అరికట్టడంతో పాటు, చెరువుల మట్టి తరలింపు, ఇటుక బట్టీలు, బొగ్గు బట్టీల అక్రమ నిర్వహణ వంటి కార్యకలాపాలను నిరోధించాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం గ్రామాల మధ్య విభేదాలు సృష్టిస్తూ, ప్రకృతి సంపదను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయాలు, వర్గాలు, కుల సంఘాల పేరుతో ప్రజల ఐక్యతను దెబ్బతీసి, గ్రామ సంపదను దోపిడీ చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామం తమ వనరులను తామే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆత్మకూరు మండల సామాజిక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచి, గ్రామ అభివృద్ధిలో ఒక మైలురాయిగా గుర్తింపు పొందింది. మేధావులు, విద్యావంతులు ఇలాంటి కార్యక్రమాలను గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పిస్తే, ప్రకృతి సంపద రక్షణలో మరింత పురోగతి సాధించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY