రైతులను మోసం చేసిన నకిలీ విత్తనాల వ్యాపారిపై పీడీ చట్టం….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసి రైతులను మోసం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన వూస సుబ్బారావుపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టాన్ని అమలు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
నిందితుడు తాండూర్, భీమిని, భీమారం, బెల్లంపల్లి-2 టౌన్, తాళ్లగురిజాల, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో ఏజెంట్లను నియమించుకుని నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ ఏడాదిలోనే అతనిపై రెండు కేసులు నమోదయ్యాయని, గత ఐదు సంవత్సరాలుగా నకిలీ విత్తనాల రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన పలు నేరాల్లో పాలుపంచుకున్నాడని పేర్కొన్నారు.
ఇప్పటికే 2021లో ఒకసారి పీడీ చట్టం అమలైనా, తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడుతున్నాడని సీపీ తెలిపారు. రామగుండం కమిషనరేట్, మంచిర్యాల జిల్లా, కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో మొత్తం తొమ్మిది కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు.
తాండూర్ సీఐ దేవయ్య, ఎస్‌ఐ ప్రసాద్ నిందితుడికి పీడీ ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాల తయారీ, నిల్వ, విక్రయాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తే అవసరమైతే పీడీ చట్టాన్ని అమలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిందితుడిపై పీడీ చట్టం అమలుకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్‌ఐ ప్రసాద్‌లను సీపీ అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
