పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలం…
రైతులు ఆందోళన చెందొద్దు.. రెండు మూడు రోజుల్లో యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం…
–కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
ప్రస్తుత వానాకాలం-2026 సీజన్‌కు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా పకడ్బందీగా ఎరువుల సరఫరా చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో 18,750 మెట్రిక్ టన్నుల యూరియా, అంటే 4,12,511 యూరియా బస్తాలు నిల్వలో ఉన్నాయని తెలిపారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి వారం రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)తో పాటు ఇతర కంపెనీల నుంచి కూడా యూరియా నిల్వలు జిల్లాకు చేరుతున్నాయని వెల్లడించారు.
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ శాఖ సమగ్ర ప్రణాళికతో పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటల విత్తనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో యూరియా బుకింగ్ యాప్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని, మరో రెండు లేదా మూడు రోజుల్లో యాప్‌ను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.
యూరియా లభ్యతపై పెద్దపల్లి జిల్లా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
