ఏఐటియుసి నాయకులపై వ్యక్తిగత దూషణలు మానుకోవాలి…
విధానాలపై విమర్శలు స్వాగతం.. వ్యక్తిగత విమర్శలు తగవు….
–పి.విజయలక్ష్మి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లాప్రతినిధి:గోదావరిఖని,
కవిత పార్టీ పేరుతో కొందరు ఏఐటియుసి నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఆర్జీ-1 జీఎం కమిటీ సభ్యురాలు పి. విజయలక్ష్మి హెచ్చరించారు.
విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, విధానపరమైన విమర్శలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అదే సమయంలో వాటికి సమాధానం చెప్పే హక్కు కూడా తమకు ఉంటుందని పేర్కొన్నారు. కవిత బాయి బాట కార్యక్రమం పేరుతో రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఆమె ఇష్టమని, అయితే ఏఐటియుసి, ఎర్రజెండాపై విమర్శలు చేస్తే తగిన విధంగా స్పందిస్తామని స్పష్టం చేశారు.
ఏఐటియుసి నాయకులపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని, అలాంటి వ్యాఖ్యలు కార్మిక సంఘాల మధ్య అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తాయని అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ అంశాలపైనే చర్చలు జరగాలని సూచించారు.
గత పాలనలో సింగరేణి కార్మికుల సమస్యలు, నియామకాలు, హక్కుల అంశాలపై అనేక ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంటూ, ప్రస్తుతం వాటిని పక్కనపెట్టి కార్మిక హక్కుల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు.
మహిళల పట్ల తమకు గౌరవం ఉందని, అందుకే వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని తెలిపారు. అయితే భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యక్తిగత దూషణలు కొనసాగితే తాము తగిన రీతిలో స్పందించాల్సి వస్తుందని పి. విజయలక్ష్మి హెచ్చరించారు.
