విషాదంలోనూ మహాదానం.. నేత్రదానంతో ఇద్దరికి వెలుగులు….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పాలకుర్తి, పాలకుర్తి మండలం కన్నాల శాలపల్లి గ్రామానికి చెందిన చింతకింది భీమలక్ష్మణ్ గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ ఆయన నేత్రాలను దానం చేసి మానవతా దృక్పథాన్ని చాటింది.
సదాశయ ఫౌండేషన్ పాలకుర్తి మండల అధ్యక్షుడు భీమనపల్లి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎల్‌వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుడి కార్నియాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు.
ఈ నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించే అవకాశం కలిగిందని నిర్వాహకులు చింతకింది కనకయ్య, కుందారపు సతీష్, బొడ్డుపెల్లి లక్ష్మన్, మేన మహేందర్ తెలిపారు. అనంతరం నేత్రదాత చింతకింది భీమలక్ష్మణ్‌కు ఘనంగా నివాళులర్పించారు.
విషాద సమయంలోనూ నేత్రదానానికి అంగీకరించి సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన ఆయన భార్య కవిత, కుమార్తెలు శివాని–రాకేశ్, వైష్ణవి–ఆదిత్యతో పాటు కుటుంబ సభ్యులు చింతకింది భాస్కర్, వెంకటేష్, ప్రసాద్, సంతోష్, అంజయ్య, గుండెటి రమేష్‌లను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి మెర్గు భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
విషాద వేళలోనూ మానవతకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
