సాక్షిత ; ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరియం సిద్దం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తుడా కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఆర్ట్ స్టూడియో పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 15 వ తేదీ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. నగరప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు సుమారు 30 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో ఈ ఆడిటోరియం నిర్మిస్తున్నామని అన్నారు. 600 మంది కూర్చుని కార్యక్రమాలు వీక్షించేందుకు వీలుగా ఆడిటోరియం ఏర్పాటు చేశామన్నారు.
సౌండ్ సిస్టమ్, స్క్రీన్, గ్రీన్ రూమ్స్ అన్ని పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆడిటోరియం లో ఏర్పాటు చేసే పరదాల తయారీ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ఆడిటోరియం ను ప్రజలకి అందుబాటులోకి తెస్తామన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఏ.ఈ.కాం, బి.ఎన్.ఆర్. సంస్థల ప్రతనిధులు ఉన్నారు.