SAKSHITHA NEWS

నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లు నిషేదం – కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత : తిరుపతి నగరంలో నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లను పూర్తి స్థాయిలో నిషేదిస్తున్నట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ప్రకటించారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం కమిషనర్ అనుపమ అంజలి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్లాస్టిక్ బ్యానర్లపై నిషేదంలో భాగంగ తిరుపతి మునిసిపల్ పరిదిలో నవంబర్ 1 నుండి నిషేదం విదిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులు, ప్రజలందరి సహకారంతో ప్లాస్టిక్ బ్యానర్లపై నిషేదం పూర్తిస్థాయిలో అమలు పరుస్తామన్నారు.

అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను దశలవారిగా తగ్గించే కార్యచరణ రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్వచ్చ సర్వేక్షన్లో ప్రెసిడెన్షియల్ అవార్డు తిరుపతి రావడంతో మరింత భాధ్యత పెరిగిందని తెలుపుతూ తిరుపతిని మరింత శుభ్రంగా వుంచడం కోసం నగరంలోని ప్రధాన రహదారులను, ఎంపికచేసిన గార్బేజ్ పాయింట్లను శుభ్రం చేసేందుకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 వరకు 20 మంది కార్మికులు, ఇద్దరు డ్రైవర్లతో త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ అనుపమ తెలిపారు.

తిరుపతి రైల్వే పార్శిల్ ఆఫిసు ఎదురుగా వున్న మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 36వేల చదరపు అడుగుల స్థలంలో మల్టిలెవల్ కాంప్లెక్స్ 50 కోట్లతో నిర్మిస్తున్నట్లు కమిషనర్ అనుపమ తెలిపారు. మల్టిలెవల్ కాంప్లెక్స్ సెల్లార్, జి ప్లస్ 7 అంతస్తుల నిర్మాణంలో 6 లిప్టుల సహాయంతో 373 కార్లు పార్కింగ్ చేసుకునేలా డిజైన్ చేయబడిందన్నారు. ఇంకా ఇందులో 550 సీట్ల కెపాసిటితో 3 మల్టి ప్లెక్స్ థీయేటర్లు, రెస్టారెంట్లు, ఇతర షాపింగ్ కాంప్లెక్సులు వుంటాయని, త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. శ్రీనివాససేతుపై పగుళ్ళు వచ్చాయి అనే అపోహలను కమిషనర్ ఖండించారు.

ఫేషియో ప్యానల్ 2 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తుతో 60 ఎం.ఎం మందంతో, ఎం 35 గ్రేట్ కాంక్రీట్ తో తయారు చేయబడి, బ్రిడ్జ్ అంచున ఇరువైపులా ప్రమాదాల నివారణకు (క్రష్ బ్యారియర్స్) ఏర్పాటుచేసిన ఆర్.సి.సి గోడలతో నిర్మాణం చేయబడిందని, వాటి మద్యలోని గ్యాపులను పగుళ్ళుగా అపోహలు పడ్డారని, ఎక్కడగాని పగుళ్ళు లేవని చెబుతూ, భవిషత్తులో కూడా పగుళ్ళు వచ్చే ఆస్కారం లేదన్నారు.

టిటిడి 67 శాతం నిధులు, స్మార్ట్ సిటి కార్పొరేషన్ 33 శాతం నిధులతో అత్యంత భధ్రమైన నాణ్యత ప్రమాణాలతో ఇండియన్ స్టాండర్స్ ప్రమాణాల ప్రకారం ఇప్పటి వరకు 85 శాతం నిర్మించడం‌ జరిగిందన్నారు. డిశంబర్ చివరికల్లా శ్రీనివాససేతు పనులను పూర్తి చేస్తామని కమిషనర్ అనుపమ తెలిపారు. తిరుపతి నగరంలో 13 మాస్టర్ ప్లాన్ రోడ్లను సకాలంలో పూర్తి చేసేందుకు కార్పొరేటర్లతో ప్రత్యేక కమిటీలను నియమించి మేయర్ శిరీషా, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్, ముద్రనారాయణ, ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో నిత్యం పని చేస్తున్నట్లు తెలుపుతూ, ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి ఇప్పటి వరకు 1804.37 లక్షలతో 37 పనులను పూర్తి చేసినట్లు కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. మీడియా సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS