శాఖాపర లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలి
-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
శాఖాపర లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎంపిడివో లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నూతనంగా బదిలీపై జిల్లాకు వచ్చిన ఎంపిడివో లు కలెక్టర్ కు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలతో మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. బదిలీలు, పోస్టింగ్ లు ప్రతి ఉద్యోగికి కొత్త జన్మ లాంటిదని, కొత్త స్టేషన్ కి వెళ్లినప్పుడల్లా, ప్రజాప్రతినిధులు, ప్రజలు క్రొత్త వారు ఉంటారని, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు, ప్రజలకు ఎంత అందుబాటులో వుంటున్నారు, ఎంత బాధ్యాయుతంగా, ఎంత నిజాయితీతో వున్నారు అన్నది ముఖ్యమని అన్నారు. క్రొత్త ప్రభుత్వం, ప్రజలు క్రొత్త అంచనాలతో ఉంటారని, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆయన తెలిపారు. సర్పంచ్ ల పదవీకాలం ముగిసినందున, ఎంపిడివో లపై ఎంతో బాధ్యత ఉందని అన్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉందని, గ్రామాల్లో ప్రత్యేక అధికారులను మార్గనిర్దేశం చేస్తూ, ప్రజలకు మంచి పాలన అందించాలన్నారు. ఎంపిడివో లు చేసే పనులతో గ్రామాల్లో మార్పు వస్తుందన్నారు. ఎన్నికల సమయమని, నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. లేబర్ టర్నోవర్ పెంచాలన్నారు. వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి, అందరూ ఉపాధి హామీ పనులపై ఆధారపడతారని, ప్రతిఒక్కరికి పని కల్పించాలని అన్నారు. అవసరమైతే జాబ్ కార్డులు ప్రింట్ చేయించాలన్నారు. ప్రతి మండలంలో కనీసం 5 వేల ఉపాధి హామీ కూలీలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. షెల్ఫ్ వర్క్ లు సరాసరి 200 కి తగ్గకుండా చూడాలన్నారు. మంజూరు పనులు వారంలోగా పూర్తికి చర్యలు తీసుకోవాలని, క్రొత్త పనులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ప్రత్యేక అధికారులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. నర్సరీల్లో త్వరగా మొలకెత్తే మొక్కలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రాజెక్ట్ రాస్తా లో భాగంగా గ్రామాల్లోని డొంకల ఆక్రమణలు తొలగించి, రహదారి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ లో భాగంగా దరఖాస్తుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో విధుల నిర్వహణ చేయాలని కలెక్టర్ తెలిపారు.
సమీక్ష లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో వేజ్ సీకర్స్ సరాసరి 23 ఉన్నట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి 50 మందికి తగ్గకుండా కూలీల గుర్తింపు చేయాలన్నారు. జిల్లాలో 1058 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గాను ఇంకనూ 390 లకు క్యాప్చరింగ్ చేయాల్సి ఉందని, వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ క్రింద చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఈ సమీక్షలో జెడ్పి సిఇఓ ఎస్. వినోద్, ఆర్. డిఆర్డీవో సన్యాసయ్య, డిపిఓ హరికిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, డిప్యూటీ సిఇఓ బి. నాగలక్ష్మి, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపిడివో లు, తదితరులు పాల్గొన్నారు.