ప్రజల పట్ల జవాబుదారీతనం తో విధులు నిర్వహించండి.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు*
సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కమిషనర్ ఎన్.మౌర్య*
సాక్షిత తిరుపతి నగరపాలక సంస్థ:
ప్రజల పట్ల జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అమెనిటీ సెక్రటరీ లు, శానిటరీ సెక్రటరీ లు, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీలతో పాటు ఆయా విభాగాల అధిపతులతో కచ్చపి ఆడిటోరియంలో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల సెక్రటరీ ల పరిధి, చేయాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మీకు కేటాయించిన విధులను బాధ్యతతో సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అన్ని విభాగాల సెక్రటరీ లు కలసి మెలసి విధులు నిర్వహించాలని, ఇది తనది కాదు అంటూ నిర్లక్ష్యం విహించారాదని అన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది ప్రతి రోజు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రతి రోజూ ఇంటింటికీ వాహనాలు వెళ్లి చెత్త సేకరణ జరిగేలా శానిటరీ సెక్రీటరీలు పర్యవేక్షించాలని అన్నారు. వీధుల్లో, రోడ్ల పైన ఎక్కడా చెత్త వేయకుండా, పరిసరాలు శుభ్రంగా ఉండేలా కిందిస్థాయి సిబ్బంది సమన్వయం చేసుకుని శుభ్రం చేయించాలని అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగపు అధికారులు, సిబ్బంది నగరంలో ఎక్కడా భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చూడాలని, అనధికారిక నిర్మాణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు లేకుండా చూడాలని అన్నారు. భవన నిర్మాణాలకు అన్ని అనుమతులు నిర్దిష్ట సమయంలో అందజేయాలని అన్నారు. నగరంలో డ్రెయిన్లు, ప్రజలకు అవసరమైన రోడ్లు, గుంతలు లేకుండా చేయడం, నిర్దిష్ట సమయంలో ప్రతి ఒక్కరికీ నీరు అందేలా ఆమెనిటి సెక్రటరీ లు చూడాలని అన్నారు.
హెల్త్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకొని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని అన్నారు. మన హెల్త్ క్లినిక్స్ లో అన్ని వైద్య సదుపాయాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా సెక్రటరీలకు ఇచ్చిన విధుల మేరకు కింది స్థాయి సిబ్బంది, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చక్కబెట్టాలి అన్నారు. ఏదో వచ్చామా, వెళ్ళామా అని కాకుండా చిత్తశుద్ధి తో విధులు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో రాజీ లేకుండా వ్యవహరించాలని అన్నారు. నగర శుభ్రత, ప్రజా సంక్షేమమే మన ధ్యేయమని, మనం ముందడుగు వేస్తే ప్రజలు కూడా మన వెంట నడుస్తారని ఆదిశగా అందరూ అధికారులు కృషి చేయాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డెప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామిరెడ్డి, డి. ఈ.లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, శ్రావణి, రాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్, యువ అన్వేష్ రెడ్డి, డి.సి.పి. శ్రీనివాసులు రెడ్డి, ఏసిపి బాల సుబ్రమణ్యం, మేనేజర్ చిట్టిబాబు, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.