అయోధ్య రామ జన్మభూమిలో “రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట” కార్యక్రమం సందర్భంగా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధి రైల్వే స్టేషన్ సమీపానగల శ్రీరామ మందిరంలో సోమవారం శ్రీ సీతరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరింది. గంజిలో ఉన్న విఠలేశ్వరస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున రాములోరి కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి
మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రత్యేక ఊరేగింపులు, భజన కార్యక్రమాలు, అభిషేకాలు, శ్రీరామ పూజిత అక్షింతలచే ఆశీర్వచనాలు ఆలయ పురోహితులు రాజేశ్వరి జోషి ఆధ్వర్యంలో జరిగాయి.
శ్రీరామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ మండల శాఖ నాయకులు, కార్యకర్తలు రామ మందిర ఆవరణలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగింపుగా ర్యాలీగా తీసుకువెళ్లారు. శ్రీరాముడిపై యావత్ భారతావనికి ఉన్న భక్తిని ప్రజలు చాటుకున్నారు. ప్రధాన చౌరస్తాలో కాషాయ జెండాను ఎగరవేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలంతా ఆధ్యాత్మిక చింతనతోపాటు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. పట్టణంలోని ప్రధాన రోడ్లు, కాలనీ రోడ్లన్నీ కాషాయ జెండాలతో నిండిపోయాయి. సుమారు 6000 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆనాటి కర సేవకులకు స్వామి వారి చిత్ర పటాన్ని బహుకరించి శాలువాతో సన్మానం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రతి ఇంటి ముందు శ్రీరామ జ్యోతులు వెలిగించి, శ్రీ సీతరాములను ఇంటికి ఆహ్వానించి, టపాసులు కాల్చి, మరో దీపావళిని జరుపుకున్నారు. ప్రతి ఇంటి ముందు ఐదు నూనె దీపాలు వెలిగించారు. అయోధ్య నుండి ఇంటికి వచ్చిన అక్షింతలు తలపై వేసుకొని పెద్ద వారితో ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు, బిజెపి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.