సాక్షిత శంకర్పల్లి: గృహ, వాణిజ్య యజమానులు నెలాఖరుకల్లా వార్షిక ఇంటి, వ్యాపార పన్నులను పూర్తిస్థాయిలో చెల్లించాలని శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు ఇళ్లకు, దుకాణాలకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. ఇంటి నుంచే ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. వాణిజ్య వ్యాపార సంస్థలకు సంబంధించి ఆస్తి పన్నులు అధికంగా పెరిగినందుకు కౌన్సిల్ పన్నులు తగ్గించుటకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది కానీ, ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడానికి జాప్యం ఉన్నందున ప్రస్తుతం ఉన్న పన్నునే వసూలు చేయుటకు సిడిఎంఏ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పన్నులు 75% నుండి 100% చెల్లించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం ఆమోదానుసారం పన్నులు తగ్గించబడతాయన్నారు. ప్రస్తుతం పన్నులు చెల్లించినచో 2 శాతం అపరాధ రుసుము నుండి బయట పడవచ్చని తెలిపారు. మార్చి 31లోపు అన్ని రకాల పన్నుల లక్ష్యాన్ని అధిగమిస్తామని కమిషనర్ తెలిపారు.
పట్టణ అభివృద్ధికి సహకరించండి: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్
రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో శంకర్పల్లి మున్సిపాల్టీ ఒకటి. పట్టణంలో కొన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. పట్టణ పౌరులు సకాలంలో ఇంటి పన్నులు, నల్లా పన్నులు చెల్లిస్తే పట్టణాభివృద్ధికి బాటలు వేసిన వారవుతారు. ప్రజలు చెల్లించే ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు చేస్తామని చైర్మన్ విజయలక్ష్మి అన్నారు.