బీఆర్ఎస్ ఆందోళనతో స్తంభించిన పార్లమెంట్
స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నామ నిరసన
పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శన
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలి : నామ నాగేశ్వరరావు డిమాండ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రెండో రోజు మంగళవారం కూడా బీఆర్ఎస్ ఎంపీలు విపక్షాలతో కలసి పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేశారు. ఎంపీల ఆందోళనతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు విపక్షాలతో కలసి స్పీకర్ పోడియం ముందుకు దూసుకెళ్లి నినాదాలు చేశారు.నామ స్పీకర్ పోడియం వద్ద నిలబడి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీలతో పాటు విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే ప్లకార్డులతో నినాదాలు చేశారు. అదానీ – హిండెన్ బర్గ్ అంశంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, పెరిగిపోతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, నిరుద్యోగం, తదితర అంశాలపై తక్షణమే పార్లమెంట్ ఉభయ సభల్లో విస్తృత చర్చకు నామ డిమాండ్ చేశారు.
ఆదానీ వ్యవహారంపై పార్టీ ఎంపీలు విపక్షాలతో కలిసి చేసిన ఆందోళనతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభం కాగానే అలాగే ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభను తిరిగి బుధవారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ . ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులపైనా తక్షణమే ఉభయ సభల్లో చర్చించాలని, అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
కేంద్రం కావాలనే పార్లమెంట్లో చర్చకు అనుమతించకుండా వెనక్కిపోతుందని నామ అన్నారు.