SAKSHITHA NEWS

అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలనే కాదు… దొంగ ఒట్లతో దేవుళ్లను కూడా మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రిది :విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ….
……………………………………………………………………
సాక్షిత : ఒట్లతో ముఖ్యమంత్రి చేసిన పాపాలకు తెలంగాణ ప్రజలను శిక్షించవద్దని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు…*

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ వాగ్దాన భంగం చేసింది.

వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తామంటూ అబద్దాల పునాదులు, అసత్య ప్రచారాలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 న ఒక్క సంతకంతో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మా నాయకుడు కెసిఆర్ కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని చెప్పడంతో బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు ప్రజల పక్షాన వారి డిమాండ్లను అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తే వారికి పాలన చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.

ఎన్నికల సమయంలో రైతులందరినీ రుణాలు తెచ్చుకోమని చెప్పి తమ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీలో 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాటి నుంచి 10 సంవత్సరాల కాలంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మా నాయకులు కెసిఆర్ ది, టిఆర్ఎస్ పార్టీది.

గత పదేళ్ల కాలంలో 24 గంటల విద్యుత్ సరఫరా, సాగునీరు, రైతుబంధు పథకాలతో వ్యవసాయాన్ని పండగగా మారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతుల కష్టాలు కరెంటు లేక, సాగునీరు అందక, రైతుబంధుతో పెట్టుబడి సాయం అందక రైతులు కష్టాల పాలయ్యే పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ పథకాలు ఏమయ్యాయి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు రాష్ట్రాన్ని అప్పులతో నింపేశారని పాలన చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.

ప్రభుత్వ పాలన, సీఎం రేవంత్ రెడ్డి పై విసుకు చెందిన తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ఒట్లు వేస్తూ ప్రజలను మోసం చేశారు.

డిసెంబర్ 9న ఏకకాలంలో పూర్తి చేస్తామన్న రుణమాఫీ పై ప్రభుత్వం మరో మారు మాట మారుస్తూ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో ప్రభుత్వం తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చెస్తే మా బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అంతా రాజీనామా చేసి ఎన్నికలలో తిరిగి పోటీ చేయమని మా హరీష్ రావు సవాల్ విసిరితే ప్రభుత్వం ఈ ప్రకటనపై తోక ముడిచింది.

రైతు రుణమాఫీకి 41 వేల కోట్లు అవసరమని చెప్పిన ప్రభుత్వం క్యాబినెట్ సమావేశానికి వచ్చేసరికి 36 వేల కోట్లుగా మార్చింది. సరే ఈ 36వేల కోట్లతో రైతులకు రుణమాఫీ జరుగుతుందని ఆశించిన తెలంగాణ ప్రజానీకానికి బడ్జెట్లో 26 వేల కోట్ల కేటాయించడం తీవ్ర ఆశ్చర్యానికి, ఒకింత బాధను కలిగించింది.

బడ్జెట్ సమావేశాల్లో కూడా రైతుబంధు, రైతు భరోసా పై చర్చ పెట్టమని ప్రభుత్వాన్ని ఎన్ని మార్లు అడిగినా వారు ఏ ఒక్క అంశంపై మాట్లాడే దమ్ము లేక వ్యక్తిగత దూషణలతో ప్రశ్నించిన వారి చావులను కోరుకున్నారు.

ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మూడు దఫాలుగా అసంపూర్తిగా రుణమాఫీ చేస్తూ రైతులను మోసం చేస్తూ మేము కట్టించిన రైతు వేదికల మీద పాలాభిషేకాలను చేసుకున్నారు.

స్వచ్ఛందంగా రైతులు అందరూ రోడ్డు మీదకు వచ్చి రుణమాఫీ కాలేదు అని నిరసన వ్యక్తం చేస్తున్నారు, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ మాట ఎక్కడకు పోయిందని ప్రశ్నిస్తున్నాం.

మీరే డెడ్ లైన్లో పెట్టి వాటిని దాటవేస్తూ మాట తప్పిన ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు.

వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మూడుసార్లు పేపర్లలో యాడ్ లు ఇచ్చి రైతు రుణమాఫీ పూర్తి చేశామని మీరంటున్న మాట నిజమైతే కూడా రైతులు ఎందుకు రోడ్లమీదకు వస్తున్నారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

రాష్ట్ర మొత్తం రుణమాఫీ విషయం పక్కకు పెడితే కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో కూడా రుణమాఫీ పూర్తిగా జరగలేదనే విషయం నిజం కాదా….?

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు, ముఖం చెల్లక మంత్రులతో మాట్లాడిస్తున్నారా….?
మంత్రుల మధ్య సయోధ్య లేక తలొక్క మాట మాట్లాడుతున్నారు.
బిఆర్ఎస్ పార్టీకి పోరాటాలు, రాజకీయాలు కొత్త కాదు.
ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.


SAKSHITHA NEWS