ప్రకృతి వైపరీత్యం ప్రభుత్వ తప్పా

Spread the love

బిఆర్ఎస్ నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారు

-పది ఏండ్లు గా ఒక్క ప్రాజెక్ట్ పైనే దృష్టి

-బిఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే కరువు

-జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్

……

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ తప్పుగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గు చేటని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మండిపడ్డారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రబీ సీజన్ ముగింపు దశ కు వచ్చిందని ఈ టైం లో పంట పొలాలు ఎండి పోయాయనడం విడ్డూరంగా ఉందని అన్నారు. పాలేరు జలాశయం అడుగంటడానికి కారణం గత బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. పది ఏండ్లు అధికారం లో ఉంది ఒక్క కాళేశ్వరం ప్రోజెక్ట్ కే డబ్బులు వృధా గా ఖర్చు చేశారని దాని వల్ల వచ్చిన కమిషన్ లతో వారి జేబులు నింపుకున్నారే తప్ప అది ప్రజలకు ఉపయోగ పడేలా లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు మాత్రమే అయిందని ఈ రెండు నెలల ప్రభుత్వంతోనే రాష్ట్రంలో చెరువులు ఎండి పోయాయని, కరువు వచ్చింది అని అనడం హాస్యాస్పదమన్నారు.

బి ఆర్ఎస్ ప్రభుత్వం పది ఏండ్లు అధికారం లో ఉండి సంపద అంతా జలగల పట్టి పీల్చుకొని ఖాళీ ఖజానాను అప్పగించారని విమర్శించారు. జిల్లాల్లో బిఆర్ఎస్ శఖం ముగిసిందని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెరువుల దగ్గరకు పోయి మీరు కార్చే ముసలి కన్నీరు ప్రజలు అర్థం చేసుకోగలరని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఉనికి చాటుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ అని ఖచ్చితంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. గతంలో భట్టి విక్రమార్క సిఎల్పీ నేతగా ఉన్నప్పుడు రాయలసీమ సంగమేశ్వర ఎత్తిపోతల పథకం గురించి కృష్ణ బేసిన్ నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఆంధ్ర తన్నుకుపోతా ఉంటే దీని మీద అందరం పోరాటం చేయాలని చెప్తే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయి నేడు ప్రోజెక్ట్ లో నీళ్ళు లేవంటూ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… డిసెంబర్ 10 వరకూ బిఆర్ఎస్ ప్రభుత్వమే ఉందని అప్పుడు పాలేరు కు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బిఆర్ఎస్ చేసిన తప్పిదాలు బయట పడుతుండటంతో దానిని కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై గుడ్డ కాల్చి వేస్తున్నారని అన్నారు. గతంలో పంట నష్ట పరిహారం చెల్లించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని విమర్శించారు. జిల్లాలో ఉన్న కీలక బి ఆర్ ఎస్ నేతలు మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇప్పటి వరకూ మీరు జిల్లాకు చేసిన ఒక్క మంచి చెప్పాలని డిమాండ్ చేశారు. కరువుకు కారణం అయిన వారు కరువు గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించిన్నట్టు ఉందని వ్యాఖ్యానించారు.


నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ప్రజా పక్షపాత పార్టీ అని ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేయడం భాదాకరమని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల నుండే ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు పరుస్తున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పది ఏండ్లు గా ఒక ముఖ్యమంత్రే రాష్ట్రంలో ఇంజనీర్ గా ఉన్నారు అయినా ప్రాజెక్టులో నీళ్ళు ఎందుకు నింపలేకపోయారో అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ ఉనికి చాటుకోవడానికి బిఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.నిజంగా మీకు ప్రజలపై ప్రేమ ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో అదికారం కట్టబెట్టే వారని అన్నారు. ప్రజలు ఇంకా బిఆర్ఎస్ మాటలు నమ్మే స్థితిలో లేరని ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా ఉన్నారని ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రసంగాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ ప్రెస్ మీట్ లో వీరితో పాటు పి సి సి సభ్యులు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ రాయల నాగేశ్వరరావు, పి సి సి సభ్యులు జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మూడుముంతల గంగరాజు యాదవ్, పెండ్ర అంజయ్య, గడ్డం వెంకటయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page