SAKSHITHA NEWS


MLC Kavitha in trouble again.. Sensation in ED attacks on liquor scam

మళ్ళీ చిక్కుల్లో ఎమ్మెల్సీ కవిత..లిక్కర్ స్కామ్‌పై ఈడీ దాడుల్లో సంచలనం.

హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గతంలో ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.


దోమలగూడ అరవింద్‌నగర్‌లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈ దాడులు జరగడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి రిజస్టర్ట్ అడ్రస్‌కు సమీపంలోనే ఉన్న గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం సరికొత్త అనుమానాలకు దారితీసింది.ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో బుచ్చిబాబుకు సంబంధం లేకపోయినా సోదాలు జరుగుతుండడం అనేక సందేహాలకు దారితీసింది.

కవితతో గతంలో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పుడు బుచ్చిబాబు ఆఫీసులో సోదాలు ముగిసిన తర్వాత లభించే ఆధారాల తర్వాత ఈడీ ఎలా వ్యవహరించబోతుందనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.మద్యం కుంభకోణంలో కవితకు ప్రమేయం ఉన్నదంటూ ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీలు ఆరోపించిన సంగతి తెలిసిందే.సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత మనీ లాండరింగ్ ఉందనే కారణంగా ఈడీకి బదిలీ అయింది.

కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నా ఢిల్లీ అధికారులు మాత్రం ధృవీకరించడంలేదు.గత కొన్ని రోజులుగా కరోనా కారణంగా కవిత ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నోటీసులు ఇచ్చినట్లుగా అనధికార వార్తలు వెలువడుతున్నాయి.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా సోదాలు జరుగుతున్న సమయంలో కవితకు కూడా నోటీసులు జారీ అయినట్లు వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్ళడం ఖాయమంటూ గత కొంతకాలంగా బీజేపీ ఆరోపిస్తూ ఉన్నది.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడుగానే వ్యవహరిస్తున్నది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న అరుణ్ రామచంద్ర్ పిళ్లై నివాసం,ఆయన పెట్టిన రెండు కంపెనీల ఆఫీసుల్లో గత వారం సోదాలు జరిగాయి.మళ్లీ శుక్రవారం రెండోసారి మొదలయ్యాయి.దాని కొనసాగింపులో భాగంగా గోరంట్ల బుచ్చిబాబు ఆఫీసులో కూడా జరుగుతుండడం గమనార్హం.గోరంట్ల అసోసియేట్స్ ఎల్ఎల్‌పీ కంపెనీలో భాగస్వామిగా ఉన్న బుచ్చిబాబు మరో మూడు కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా,అదనపు డైరెక్టర్‌గా కంటిన్యూ అవుతున్నారు.ఆ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నవారి ఆఫీసుల్లో సోదాలపై ప్రస్తుతం ఈడీ బృందాలు ఇంకా దృష్టి సారించలేదు.


SAKSHITHA NEWS