సాక్షిత : దళితబందు 2 లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి 2 వ విడత దళిత బంధు అమలు, లబ్దిదారుల ఎంపికకు సంబంధించి నగరానికి చెందిన MLC లు, MLA లు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళిత వర్గాలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబందు అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఈ పథకం క్రింద అర్హులైన ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించబడుతుందని వివరించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి వారు కోరుకున్న యూనిట్ ను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2 వ విడత అమలులో భాగంగా ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1100 మంది చొప్పున లబ్దిదారులకు ఆర్ధిక సహాయం అందించబడుతుందని వివరించారు.
దళితబందు ఆర్ధిక సహాయం కోసం వారం రోజుల్లో దరఖాస్తులను అధికారులకు అందజేయాలని చెప్పారు. వచ్చిన దరఖాస్తులపై 2,3 రోజులలోనే సమగ్ర విచారణ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేయాలని, ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వవద్దని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్న యూనిట్ లను ఎంపిక చేసుకొనే విధంగా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా మొదటి విడతలో అందజేసిన యూనిట్ లు లబ్దిదారుల నిర్వహణ లో ఉన్నాయా లేదా అని తప్పనిసరిగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
యూనిట్ ల నిర్వహణ, వారు పొందిన లబ్ది గురించి వీడియో, ఫోటోల రూపంలో నివేదికలను రూపొందించి అందజేయాలని చెప్పారు. కొనుగోలు చేసిన వివిధ వాహనాలకు ఏర్పాటు చేసిన దళితబందు పథకం స్టిక్కర్లను తొలగిస్తున్నారని, వాటిని తొలగించకుండా చూడాలని పలువురు MLA లు సమావేశం దృష్టికి తీసుకు రాగా, స్టిక్కర్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో MLC లు సురభి వాణిదేవి, రహ్మత్ బేగ్, MLA లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, కౌసర్ మొహినోద్దిన్, బలాల, మొజాం ఖాన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, కలెక్టర్ అనుదీప్, SC కార్పోరేషన్ హైదరాబాద్ జిల్లా ED రమేష్, వివిధ నియోజకవర్గాలకు చెందిన దళితబందు స్పెషల్ ఆఫీసర్ లు పాల్గొన్నారు.