ములుగు జిల్లాలో పర్యటించిన:మంత్రి సత్యవతి రాథోడ్

Spread the love

సాక్షిత ములుగు జిల్లా :
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే దారిలో ఉన్న గుండ్ల వాగు రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అనంతరం గోవిందరావు పేట, ఏటూరు నాగారం మండలాల్లో బాధితులకు ఆహార వస్తువులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదు అయిందని తెలిపారు. గుండ్ల వాగు ప్రాజెక్ట్, దయ్యాలవాగు జంపన్న వాగు, ప్రవాహం వలన కొండాయి గ్రామం పూర్తిగా దెబ్బతినగా 8 మంది చనిపోయారని వెల్లడించారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 55 మందిని రక్షించాయని పేర్కొన్నారు. ఆస్తి నష్టం, పంట నష్టాలను అంచనా వేసి తక్షణమే ప్రభుత్వ సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.

గోదావరి నదిలో 14 లక్షల 80 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని,రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని సూచించారు . జిల్లా వ్యాప్తంగా వరదలలో 12 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలకుఅండగా ఉంటుందనీ, తక్షణమే ప్రభుత్వం తరఫున సాయం అందిస్తుందని తెలిపారు.

వరద ముంపునకు గురైన అన్ని గ్రామాలలో కరెంటు, మంచినీటి సౌకర్యం, శానిటేషన్, హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆమె వెంట జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్‌కో చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్పీ గౌస్ ఆలామ్, ఐటీడీఏ పీవో అంకిత్, గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్, అధికారులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page