Minister Puvwada who started our development works under Mana Uru Manabadi program
మన ఊరు మనబడి కార్యక్రమంలో మన అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నగరంలో 40వ డివిజన్ మోమినన్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో రూ. 67.59 లక్షలతో చేపట్టి, పనుల పూర్తి తర్వాత పాఠశాలలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాల కల్పన చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, పిల్లలకు మంచి వాతావరణంలో, చదువుపై ఆసక్తి కలిగి ఇష్టంగా చదువుకొనేలా రూపొందిస్తున్నట్లు ఆయన అన్నారు.
పాఠశాల గోడలపై ఏర్పాటు చేసిన పలు చిత్రాలు చూసి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా తరగతి గదులలోని విద్యార్థులను కలిసి ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో ప్రతి విద్యార్థి ఉన్నత, నాణ్యతా ప్రమాణాలతో విద్యను పొందలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మన బస్తీ- మన బడి, మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టి పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా అధిక నమోదులు ఉన్న 426 పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక కార్పొరేటర్ అమృతమ్మ, డీఈఓ సోమశేఖర్ శర్మ, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.