నిమ్స్‌లో రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి దాకా అన్నీ ఆన్లైన్ కావాలి.. మంత్రి హరీశ్ రావు ఆదేశం
నిమ్స్ దవాఖానలో ‘అంతర్గత ఆన్లైన్ విధానం’ ప్రారంభించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు.
ఓపీ రిజిస్ట్రేషన్ మొదలు వైద్యులను సంప్రదించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు, చికిత్స అందించడం ఇలా అన్ని దశల్లోనూ ఆన్లైన్లో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇందుకు సమగ్ర విధానం రూపొందించాలని చెప్పారు. నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానల పనితీరుపై మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రభుత్వ దవాఖానలు బలోపేతమై ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాయని అభినందించారు. ముఖ్యంగా నిమ్స్‌పై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉన్నదని, దాన్ని కాపాడుకోవాలని సూచించారు. దూర ప్రాంతాల రోగులకు అదేరోజు ఓపీ, కన్సల్టేషన్, పరీక్షలు, డాక్టర్ మెడికల్ అడ్వైజ్ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇందుకోసం రివ్యూ ఓపీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ కొరత లేకుండా అనుసరిస్తున్న విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు.