వార్డు పర్యటనలోనే స్పందించిన మేయర్ మహంకాళి స్వామి….
జేసీబీలతో పూడిక తొలగింపు, నీటి ప్రవాహం పునరుద్ధరణ….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి,
ఏళ్లుగా పరిష్కారం కాక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రగతినగర్ కాలువ సమస్యకు రామగుండం నగర పాలక సంస్థ శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. వార్డు సందర్శనలో భాగంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మున్సిపల్ కమిషనర్ జె. అరుణశ్రీతో కలిసి శుక్రవారం 23వ. డివిజన్ ప్రగతినగర్‌లో పర్యటించి కాలువ సమస్యను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బెంద్రం సునీతా రాజిరెడ్డి, ప్రగతినగర్ కాలువ నుంచి ప్రవహించే నీరు ఎన్‌టీపీసీ ప్రహారీ గోడ పక్కన గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోతున్న సమస్యను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మేయర్ ఆదేశాల మేరకు జేసీబీ యంత్రాలు, బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో కాలువలో పెరిగిన చెట్ల గుబుర్లు, పూడికను తొలగించి శుభ్రం చేశారు.
అనంతరం మేయర్, కమిషనర్ ఎన్‌టీపీసీ పీటీఎస్ ప్రాంతంలోకి వెళ్లి అక్కడి డ్రెయిన్‌ను కూడా పరిశీలించారు. కాలువకు అనుసంధానంగా ఉన్న డ్రెయిన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంతో నిలిచిపోయిన నీరు మళ్లీ సాఫీగా ప్రవహించడం ప్రారంభమైంది. దీంతో ఎన్నో ఏళ్లుగా నీరు నిల్వ ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలువకు పూర్తిస్థాయిలో ఉపశమనం లభించింది.
మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, ఎన్‌టీపీసీ అధికారులు ఏర్పాటు చేసిన గ్రిల్స్ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో కాలువ మూసుకుపోయి వర్షాకాలంలో ప్రగతినగర్ ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి ఏర్పడేదన్నారు. ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా కాలువ వద్ద పైపులు ఏర్పాటు చేసే చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారని చెప్పారు.
ప్రస్తుతం నగర పాలక సంస్థ చేపట్టిన పూడిక తొలగింపు చర్యలతో వర్షాకాలంలో నీరు నిలిచిపోయే ప్రమాదం గణనీయంగా తగ్గిందన్నారు. నగర ప్రజలు కూడా సహకరించి ప్లాస్టిక్ సీసాలు, చెత్తను కాలువల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాలువ నిర్వహణలో ఎన్‌టీపీసీ అధికారులు కూడా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, టీపీఎస్ నవీన్, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, శానిటరీ జవాన్ సంపత్, ఎకో వారియర్స్ కన్సల్టెన్సీ సభ్యులు స్వరూప్, మహేంద్ర, వాటర్ సప్లై సూపర్‌వైజర్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
