రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం…..

Sakshitha news

రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం…..

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ డిమాండ్….

సాక్షిత న్యూస్ పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదించే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి మహిళా సంఘాల ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి జీఓ నంబర్ 7, 8, 9లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్, మరుగుదొడ్లు, వంట షెడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
విద్యార్థులకు ఉచిత రవాణా, బడి బస్సులు, ఉచిత బస్సు పాస్‌లు అందించాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ర్యాగింగ్ నిరోధక, డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయడం, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించడం, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు, ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే జాతీయ విద్యా విధానం–2020ను తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపునకు సహకరించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు రేణుకుంట్ల ప్రీతం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు తడిగొప్పుల అనుప్ సాయి, అభిషేక్, గణేష్, అమరేందర్, రాహుల్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top