జిల్లాలో మాతృ మరణాలను నివారించాలి – జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
జిల్లాలో మాతృ మరణాలను నివారించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో మాతృ మరణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రసవ సమయంలో వివిధ కారణాలతో మరణిస్తున్న గర్భవతులను, సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించి సంరక్షించాలన్నారు.
జిల్లాలో ఏప్రిల్, 2022 నుండి నేటి వరకు 11 మాతృమరణాలు సంభవించినట్లు, ఇందులో 7 మరణాలు ప్రసవ సంబంధ కారణాలు ఉండగా, మిగతా 4 మరణాలు ఇతర కారణాలతో జరిగినట్లు ఆయన తెలిపారు. సమీక్షలో మరణాల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు, మరణించిన వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
వైద్యాధికారులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు చేస్తూ,సరైన సమయంలో వైద్యం అందిస్తూ, తీసుకోవాల్సిన పోషకాహారం పై గర్భవతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రసవానంతరం 45 రోజులు ప్రతి కేసును పర్యవేక్షణ చేయాలన్నారు. తల్లిపాలు సరిగా రాని వారికి, మాతృ మరణాలు జరిగిన శిశువులకు తల్లి పాలు బ్యాంకు నుండి తల్లిపాలు పొందేలా అవగాహన కల్పించాలన్నారు. ఇడిడి కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఏఎన్సి పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. సీరియస్ కేసుల విషయంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ, అందుబాటులో ఉండాలన్నారు. కేటాయించిన విధుల సక్రమంగా చేపట్టని వైద్యాధికారి నుండి వివరణ కు ఆదేశించాలని, ఏఎన్ఎం, ఆశా లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్ష లో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు , జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, గైనకాలజీ హెచ్ఓడి కృప ఉషశ్రీ, మమత వైద్య కళాశాల గైనకాలజీ హెచ్ఓడి డా. విజయశ్రీ, ఫోగీసి బాధ్యులు డా. రెహానా బేగం, ప్రాజెక్ట్ అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎం, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.