మధ్యాహ్న భోజనం నిర్వహణ ప్రైవేట్ కు వద్దు
** తిరుపతి కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ధర్నా
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో మధ్యాహ్న భోజన నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్ష – కార్యదర్శులు ఎస్ .జయచంద్ర, టి.సుబ్రమణ్యంలు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకాన్ని మరింత నాణ్యతగా నిర్వహించ డానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కోరారు. నాయుడుపేటలో మధ్యాహ్న భోజన నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడాన్ని తప్పు పట్టారు.
ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు జీతం పదివేలకు పెంచాలని, మెనూ ఛార్జీలు ప్రతి విద్యార్థికి 20 రూపాయలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వంట షెడ్లు లేని చోట షెడ్లు నిర్మించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.మునిరాజా, మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష – కార్యదర్శులు సజీరియా, విజయ, వెంకటేశ్వర్లు, మణి, మల్లిక, శ్రావణి, రజియా తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY