సత్తయ్య కి నివాళులర్పించిన నాయకులు
దేవరకొండ సాక్షిత
దేవరకొండ పట్టణం పాత బజారుకి చెందిన ముసిని (ఆప్కో) సత్యయ్య అకస్మాతుగా గుండె పోటుతో శివైక్యం చెందారు. దవాగ్నిలా ఆయన మరణ వార్త దేవరకొండ మానవ లోకాన్ని విషాదంలోకి నెట్టి వేసింది. ఈ వార్త తెలుసుకొని దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, యంపీపి జాను యాదవ్, రైతుబంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖుులతో కలిసి బాధ తప్త హృదయంతో వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తన సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతను నిలువుటద్దం సత్తయ్య గారని అన్నారు.
యవనత్వం నుంచి చివరి వరకు సామాజిక భావాలతో జీవించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని గుర్తు చేశారు. స్వచ్ఛందంగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో, వాటికి కావాల్సిన ఆర్థిక వనరులను తన వంతుగా సహకారం అందించడంలో ఆయన దేవరకొండ లోకానికి ఆదర్శమని అన్నారు. గుడి బడి ఏ కార్యక్రమం దేవరకొండ పట్టణంలో చేపట్టిన ముందుండి కార్యక్రమాన్ని నడిపించడమే కాదు కావాల్సిన సూచనలు సలహాలను ఇస్తూ గొప్ప మార్గదర్శకుడిలా ఆయన వ్యవహరించేవారని గుర్తు చేశారు. పట్టణంలో ఎక్కడ కనిపించినా చిరు దరహాసంతో మందలిచ్చి ప్రజలందరి ప్రేమను చూరగొన్న అజాత శత్రువని అన్నారు. సత్యయ్య గారు చేసిన సేవలను ఒక్కోటికిగా గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. స్నేహశీలి, మృధు స్వభావి, అజాత శత్రువు, సమాజ శ్రేయస్సు పిపాసకులైన సత్యయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు స్వర్గ ప్రాప్తి కలిగించాలని కోరుకున్నారు. ఈ సందర్భంలో ఆయన వెంట గాజుల మురళి, నక్క వెంకటేశ్, ముసిని అంజన్ (జర్నలిస్టు), శ్రావణ్ తదితరులు ఉన్నారు.