ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ముందస్తు కార్యాచరణ
-మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం
-అక్టోబర్ ఒకటికి ఈ క్రాప్, ఈ పంట నమోదు పూర్తి కావాలి
-కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు సిద్దం చేసుకోవాలి
-సీజన్ ప్రారంభానికి ముందే మండల ప్రత్యేక అధికారులు గన్ని బాగ్స్ నిర్ధారణ చేసుకోవాలి
+మిల్లర్ల వారీగా సేకరణ లక్ష్యాలను కేటాయించాలి, ట్యాగింగ్ చెయ్యాలి
-సీ.ఎమ్.ఆర్ లక్ష్యాలను పూర్తి చెయ్యని మిల్లర్ల లక్ష్యాలను తగ్గించాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, సాక్షిత :
రైతులకు కనీస మద్దతు ధరను అందించడమే లక్ష్యంగా వారి తరపున ఆలోచన చేసి వారి అభీష్టం ను అనుసరించి మిల్లులకు పంపడం, అదే క్రమంలో మిల్లు యొక్క సామర్ధ్యం మేరకు మిల్లర్ల కు లక్ష్యాలు ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ చేశారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ పై సమన్వయ శాఖల, మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి మిల్లుల వారీగా నిర్దేశించిన ధాన్యం సేకరణ వివరాలు అసోసియేషన్ ప్రతినిధులకు ముందస్తుగా తెలియచెయ్యడం జరుగుతుందన్నారు. ఆయా మిల్లుల సామర్థ్యం అనుసరించి లక్ష్యాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ధాన్యం సేకరణ సంబంధించి పౌర సరఫరాల శాఖతో పాటు రెవిన్యూ యంత్రాంగం కూడా భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. మండల అభివృద్ది అధికారులు కూడా బాధ్యతలు చేపట్టాలని , మండల ప్రత్యేక అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వాస్తవంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులను గుర్తించి నిర్ధారణ చేసుకోవాలని ఆదేశించారు.
రైతులకి కనీస మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలను అందజేయాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ కోసం వినియోగించే వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉండేలాగా రవాణా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లు వద్ద ఎక్కువ సమయం వాహనాలు వేచి ఉండే అవకాశం లేకుండా ఆయా మిల్లర్లు తగిన ఏర్పాట్లను చేసుకోవాలని, హమాలీలను తగినంతగా సిద్ధం చేసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు మాట్లాడుతూ, ఈక్రాప్ బుకింగ్, ఈ పంట నమోదులను అక్టోబర్ ఒకటవ తేదీ లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. సమన్వయ శాఖలు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పరిశీలన చేయాలన్నారు. వాటిని ఆ మేరకు నిర్ధారణ చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఆర్డీవో కే ఎల్ శివ జ్యోతి, జిల్లా మేనేజర్ (పౌర సరఫరాల) టి. రాధిక, డి ఎస్ వో పి. విజయ భాస్కర్, డిసివో శ్రీరాములు నాయుడు, మార్కెటింగు ఏ డి ఎమ్ సునీల్ వినయ్, జిల్లా తూనికలు కొలతలు అధికారి కే. శ్యాముల్ రాజు, ఎఫ్ సి ఐ అధికారులు కే ఎస్ ఎన్ మూర్తి, జి రంజిత్, తూర్పు గోదావరి జిల్లా మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు గారపాటి బాబురావు, కర్రీ వెంకట రెడ్డి, కొవ్వూరు నుంచి సుంకవల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.